
Srinivas Avasarala Comments On Nootokka Jillala Andagadu
‘‘నా రచన, నటన, దర్శకత్వం నన్ను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాయి. సినిమాలన్నీ రైటింగ్ అండ్ ఎడిటింగ్ టేబుల్‌పైనే జరుగుతాయని నా ఫీలింగ్. అందుకే నాకు రచనే సంతృప్తినిస్తుంది. దర్శకత్వం నన్ను ఒత్తిడికి గురి చేస్తుంది’’ అన్నారు రచయిత, నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్. రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వంలో అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ జంటగా నటించిన చిత్రం ‘నూటొక్క జిల్లాల అందగాడు’. ‘దిల్’ రాజు, క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్‌రెడ్డి, క్రిష్ జాగర్లమూడి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ చిత్రానికి కథ అందించి, హీరోగా నటించిన అవసరాల శ్రీనివాస్ చెప్పిన విశేషాలు.
► హిందీలో వచ్చిన ‘బాల’ చిత్రానికి మా ‘నూటొక్క జిల్లాల అందగాడు’ రీమేక్ కాదు. 2019 అక్టోబరులో మా సినిమా ఓపెనింగ్ జరిగింది. అప్పటికి ‘బాల’ రాలేదు. తర్వాత ‘బాల’ వస్తుందని తెలిసి వీలైనంత తొందరగా పూర్తి చేసి, ‘బాల’కు పోటీగా ఈ సినిమాను విడుదల చేద్దామనే ప్రయత్నం చేశాం.. కుదర్లేదు. 2020 ఏప్రిల్‌లో విడుదల చేద్దామనుకుంటే.. మార్చిలోనే లాక్‌డౌన్ విధించారు. అయితే ‘బాల’ సినిమా ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి మా సినిమాలో ఏమైనా మార్పులు అవసరం అవుతాయా? అని నేనా సినిమా చూశాను. మార్పులేవీ అవసరం లేదనిపించింది. మా సినిమా కథ వేరేలా ఉంటుంది.
► పక్కవారిలో ఏదైనా లోపం ఉంటే దాన్ని ఎత్తి చూపిస్తూ కొందరు కామెడీగా, హేళనగా మాట్లాడుతుంటారు. దీనివల్ల ఆల్రెడీ తాము బాగోలేమనే ఆత్మన్యూనతాభావంలో ఉన్నవారి ఆత్మవిశ్వాసం మరింత దెబ్బ తింటుంది. ఇలాంటి ఓ అంశం ఆధారంగా సినిమా చేసే ఆలోచన ఉందని క్రిష్‌గారితో చెబితే ఐడియా బాగుందన్నారు. ఇది ఎమోషన్‌తో కూడిన హ్యూమర్ మూవీ. ఇలాంటి కామెడీ ఎక్కువ కాలం నిలిచిపోతుందన్నది నా నమ్మకం.
► నేను డైరెక్షన్ చేస్తున్న ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’ (వర్కింగ్ టైటిల్) సినిమా యాభై శాతం పూర్తయింది. మిగతా భాగం అమెరికాలో షూట్ చేయాలి. టీమ్‌కి వీసాలు కావాలి. అందుకు కాస్త ఆలస్యం అవుతుంది. ఈ లోపు ఓ సినిమా చేద్దామని ‘నూటొక్క జిల్లాల..’లో నటించాను. నా డైరెక్షన్‌లో ఓ సినిమా సెట్స్‌పై ఉన్నప్పుడు మరో సినిమాకు నేను దర్శకత్వం వహించడం నాకు కరెక్ట్ కాదనిపించింది. అందుకే నా అసోసియేట్ డైరెక్టర్ విద్యాసాగర్ ‘నూటొక్క జిల్లాలకు..’ డైరెక్షన్ చేస్తే బాగుంటుందని నిర్మాతలతో చెప్పాను.
► ఒక్క సినిమాతో ప్రపంచంలో సమస్యలు పరిష్కారం కావు. సందేశం ఇవ్వాలని ఈ సినిమా చేయలేదు. అయితే ఎవరికైనా సందేశంలా అనిపిస్తే ఓకే. ఎవర్నీ కించపరచాలనో, అవహేళన చేయాలనో ఈ సినిమా తీయలేదు. నిజంగా మా సినిమాలోని సన్నివేశాలు, హ్యూమర్ ఎవరి మనోభావాలను అయినా దెబ్బతీసినట్లయితే.. ఒకవేళ సినిమా సక్సెస్ అయినా కూడా నేను ఫ్లాప్ అయినట్లే. ఏ పాయింట్‌ని అయినా కాస్త నవ్విస్తూ చెబితే ప్రేక్షకులకు బాగా రీచ్ అవుతుందని నా నమ్మకం.
► నా కెరీర్ గురించి నాకు కంగారు లేదు. నా సినిమా కథలను నేనే రాసుకుంటున్నా. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా రాయడానికి మూడేళ్లు పట్టింది. ‘జో అచ్యుతానంద’ చిత్రాన్ని రెండేళ్లల్లో రాశాను. ఆ నెక్ట్స్ సినిమాకి రెండేళ్లు పట్టింది. ఈ కథ నాది కాదనే ఫీలింగ్ ఉంటే ఆ సినిమాకు నేను డైరెక్షన్ చేయలేను.
► యాక్టర్‌గా నన్ను నేను భిన్నమైన పాత్రల్లో చూడాలనుకుంటాను. అందుకే ‘జెంటిల్‌మేన్’లో విలన్‌గా చేశా. అలాగే బాగా నచ్చి చేసిన ‘బాబు బాగా బిజీ’ ఆడకపోయినా చేసినందుకు రిగ్రేట్ ఫీల్ కావడం లేదు.
► నేను రాసిన కథలకు ఇప్పటివరకు ఏ ప్రాబ్లమ్ రాలేదు. హింసాత్మక చిత్రాలు నాకు పెద్దగా నచ్చవు. ఇప్పట్నుంచి ఎక్కువగా రచన, దర్శకత్వంపైనే ఫోకస్ పెడదామని అనుకుంటున్నాను. ఓటీటీలో నిత్యా మీనన్ లీడ్ రోల్ చేయనున్న ‘కుమారి శ్రీమతి’ అనే షోకి రన్నర్‌గా చేయనున్నాను.
Comments
Please login to add a commentAdd a comment