టైటిల్: 105 మినిట్స్
నటీనటులు:హన్సిక
నిర్మాత: బొమ్మక్ శివ
దర్శకుడు: రాజుదుస్సా
సంగీతం: సామ్ సి. ఎస్
సినిమాటోగ్రఫీ : కిషోర్ బోయిదాపు
విడుదల తేది: జనవరి 26, 2024
కథేంటంటే..
ఒకే పాత్ర చుట్టూ తిరిగే కథ ఇది. జాను(హన్సిక) కారులో ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరుతుంది. మార్గ మధ్యలో ఓ అదృశ్య శక్తి తనను వెంటాడుతున్నట్లు కనిపిస్తుంది. దీంతో ఆందోళన చెందిన జాను..భయం భయంతో ఇంట్లోకి వెళ్తుంది. భారీ వర్షం కారణంగా ఇంట్లో కరెంట్ పోతుంది. కొవ్వొత్తి వెలిగించగానే కొన్ని భయానక శబ్దాలు వస్తుంటాయి. తనను వెంటాడిన అదృశ్య శక్తి .. ఇంట్లోకి వచ్చి ఇనుప గొలుసుతో జానును బంధించి చిత్ర హింసలు పెడుతుంది.మేల్ వాయిస్‌లో మధ్య మధ్యలో తన మరణానికి నువ్వే కారణమంటూ.. అందుకే ఇదంతా అనుభవించాలంటూ భయపెడతుంది. ఇంట్లో నుంచి పారిపోయేందుకు జాను ప్రయత్నించినా.. ఆ అదృశ్య శక్తి బయటకు పోనివ్వదు. మరి జాను ఆ అదృశ్య శక్తి నుంచి ఎలా బయటపడుతుంది? ఆ మేల్ వాయిస్ ఎవరిది? తన మరణానికి జాను ఏ విధంగా కారణమైంది? చివరకు ఏం జరిగింది అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
ఒక సినిమా తీయాలంటే నటీనటులు ఎంతో కీలకం. చాలా పాత్రలు ఉంటాయి. ప్రతి పాత్రకు డైలాగ్స్ ఉండాలి. పాటలు, కామెడీ ఇవన్నీ ఉండాలి. కానీ అలాంటివేమీ లేకుండా సింగిల్ క్యారెక్టర్‌తో సినిమా తీయడం అంటే కత్తిమీద సామే అని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఇలాంటి సినిమాను తీయాలంటే దర్శకుడికి చాలా ధైర్యం ఉండాలి. అలాంటిదీ చేసి చూపించారు దర్శకుడు రాజుదుస్సా. ఇలాంటి ప్రయోగం చేసిన దర్శక నిర్మాతలను అభినందించాల్సిందే. అయితే ఒక్క క్యారెక్టర్‌తో రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడిని థియేటర్‌లో కూర్చోబెట్టాలంటే.. బలమైన కథ, ఆసక్తికరమైన సన్నివేశాలు ఉండాలి. లేదంటే ప్రేక్షకుడు ఒక్క పాత్రనే చూస్తూ కుర్చిలో కూర్చోలేడు. 105 మినిట్స్‌లో అది మిస్సయింది. కాన్సెప్ట్ బాగున్నా.. దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించడంలో దర్శకుడు తడబడ్డాడు.
ఒక కనిపించని మనిషి పంచభూతాలని గుప్పెట్లో పెట్టుకొని అమ్మాయిని ఏడిపించే ఆటే ఈ సినిమా కథ. చాలా ఆసక్తికరంగా కథను ప్రారంభించాడు దర్శకుడు. భారీ వర్షం.. ఉరుములు మెరుపులు.. కారులో హీరోయిన్.. సడెన్‌గా ఓ అదృశ్య శక్తి ప్రత్యేక్షం అవ్వడం.. ఇలాంటి భయపెట్టే సన్నివేశాలన్నీ ప్రారంభంలోనే చూపించాడు. హీరోయిన్ ఇంట్లోకి వెళ్లిన తర్వాత కథ ముందుకు సాగదు. జాను కాళ్లకు కట్టిన సంకెళ్లను విడిపించేందుకు ప్రయత్నించడం.. అదృశ్య శక్తి దాన్ని అడ్డుకోవడం.. ఇంటర్వెల్ వరకు ఇదే సీన్ రిపీట్ అవుతుంటుంది. సినిమా మొత్తం హీరోయిన్ ఏడుస్తూనే ఉంటుంది. ప్రతిసారి ఆత్మ బెదిరించడం.. హీరోయిన్ అక్కడ నుంచి వేరే చోటుకి మారిపోవడం ఇదే జరుగుతుంది. అసలు ఆ ఆత్మ ఎందుకు జానుని వేధిస్తుందో అనేది కూడా బలంగా చూపించలేకపోయారు. క్లైమాక్స్ కూడా ఆసక్తికరంగా ఉండడు. హన్సిక ఇంట్లో ఎందుకు ఇరుక్కుంది? ఆ ఆత్మ నేపథ్యం ఏంటి అనేది క్లారిటీగా చూపిస్తే బాగుండేది. చివర్లో ఒక్క డైలాగ్‌తో ప్రేక్షకుడే కథను అర్థం చేసుకునేలా చేశారు. సింగిల్ షాట్ మూవీ కాబట్టి ఇతర పాత్రలు, ఎలిమెంట్స్ తీసుకొచ్చే అవకాశం ఉండడు. ఉన్న ఒక్క పాత్ర చుట్టు అయినా ఆసక్తికరమైన సన్నివేశాలు రాస్తే బాగుండేది. కానీ పలు సవాళ్ల మధ్య ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రయోగం అయితే బాగుంది కానీ..అది మాత్ర పూర్తిగా ఫలించలేదనే చెప్పాలి.
ఎవరెలా చేశారంటే..
జాను పాత్రకు హన్సిక పూర్తి న్యాయం చేసింది. ఆమెకు ఇది ఒక డిఫరెంట్ మూవీ. తొలిసారి ఇలాంటి క్యారెక్టర్ చేసి మెప్పించింది. అయితే అయితే కథలో బలం లేనప్పుడు నటీనటులు ఎంత చక్కటి నటనను కనబర్చిన అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. సాకేంతిక పరంగా సినిమా బాగుంది. సామ్ సి. ఎస్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. కథలో బలం లేకున్నా.. తనదైన బీజీఎంతో కొన్ని చోట్ల భయపెట్టాడు. సినిమాటోగ్రపీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment