అనురాగ్ పాథక్ రచించిన 12Th Fail అనే నవలను ఆధారంగా చేసుకుని.. అదే పేరుతో బాలీవుడ్ దర్శకుడు విధూ వినోద్ చోప్రా సినిమాను తెరకెక్కించారు. విక్రాంత్ మస్సే ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం విశేష ఆదరణ సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి ఫైనల్ IMDb రేటింగ్ 9.2 దక్కింది. కొద్దిరోజుల క్రితం 69వ 'ఫిలిం ఫేర్' అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే వంటి ఐదు అవార్డులను గెలుచుకుంది.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు 12Th ఫెయిల్ చిత్రం అంతర్జాతీయంగా కూడా దూసుకుపోయింది. ప్రపంచవ్యాప్తంగా 250 ఉత్తమ చిత్రాల జాబితాలో ఈ మూవీకి చోటు దక్కింది. ఏకంగా టాప్- 50లో ఈ సినిమా ఉండటం విశేషం. ఈ సంతోషకరమైన అప్‌డేట్‌ని దర్శకుడు విధు వినోద్ చోప్రా తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. టాప్ -50లో చేరిన ఏకైక ఇండియన్ చిత్రంగా 12Th ఫెయిల్ రికార్డ్ క్రియేట్ చేసింది.
ఎందరినో మెప్పించిన ఈ సినిమా నిజమైన ఒక వ్యక్తి జీవితం అని తెలిసిందే. ముంబయి మహానగర అడిషనల్ కమిషనర్ మనోజ్ జీవితమే ఈ కథ. మనోజ్ జీవిత కథను ఆయన మాజీ రూమ్‌మేట్ పాండే ఉరఫ్ అనురాగ్ పాథక్ 12Th ఫెయిల్ అనే పుస్తకంగా రాశాడు. దాన్నే- ప్రముఖ హిందీ దర్శకుడు విధూ వినోద్ చోప్రా సినిమాగా తెరకెక్కించి సూపర్‌హిట్ అందుకున్నారు. ఆయన పాత్రలో కనిపించిన విక్రాంత్ మస్సే నటనకు సినీ ప్రియులు మెచ్చుకున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా మేధా శంకర్ కనిపించారు. ఒక్కసారిగా ఆమె బాలీవుడ్‌లో గుర్తింపు పొందారు.
Comments
Please login to add a commentAdd a comment