30 weds 21 వెబ్‌ సిరీస్‌ రివ్యూ | 30 Weds 21 Web Series Review In Telugu: Check For Cast, Highlights, Rating | Sakshi
Sakshi News home page

యూట్యూబ్‌ని షేక్‌ చేస్తున్న ‘30 వెడ్స్‌ 21’ వెబ్‌ సిరీస్‌ రివ్యూ

Published Sun, Jun 6 2021 5:39 PM | Last Updated on Mon, Jun 7 2021 10:43 AM

30 Weds 21 Web Series Review In Telugu: Check For Cast, Highlights, Rating - Sakshi

టైటిల్‌: 30 వెడ్స్‌ 21
న‌టీటులు: చైతన్య రావు, అనన్య, మహేందర్, దివ్య, వీరభద్రం, తదితరులు
ద‌ర్శ‌క‌త్వం: పృథ్వీ వనం
సంగీతం:  జోస్ జిమ్మీ
సినిమాటోగ్ర‌ఫీ : ప్రత్యక్ష్ రాజు
విడుదల తేది :  మే 2, 2021(యూట్యూబ్‌)

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా గత రెండేళ్ల నుంచి తెలుగులో వెబ్‌ సిరీస్‌లకు, ఓటీటీ కంటెంట్‌కు ఆదరణ పెరిగిపోయింది. సినిమా థియేటర్లకు తాళం పడడం, కొత్త సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో వెబ్‌ సిరీస్‌లపై దృష్టి పెట్టారు ప్రేక్షకులు. ఇక ఇదే సరైన సమయంగా భావించిన యూట్యూబ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్, ఓటీటీ వేదికలు సరికొత్త వినోదంతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తున్నాయి. ఇటీవల యూత్‌ని బాగా అట్రాక్ట్‌ చేసిన వెబ్‌ సిరీస్‌ ‘30 వెడ్స్ 21’. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వెబ్‌ సిరీస్‌ వీడియో క్లిప్స్‌ వైరల్‌గా మారాయి. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా ఓపెన్‌ చేస్తే చాలు చాలా వరకు 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ వీడియో క్లిప్స్ కనిపిస్తున్నాయి. యూత్‌ని అంతలా ఆకర్షించిన ‘30 వెడ్స్ 21’ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.


 
కథేమిటంటే..
పృద్వి(చైతన్య రావ్) ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. 30 ఏళ్ల బ్యాచిలర్‌. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఇంటి నుంచే పని చేస్తుంటాడు. లాక్‌డౌన్‌ సమయంలో అనుకోకుండా ఎందరికో పెళ్లిళ్లు అయిపోయినట్టుగానే పృద్వి వివాహం కూడా 21 ఏళ్ల అమ్మాయి మేఘన(అనన్య)తో జరిగిపోతుంది. అయితే తన కన్నా చాలా చిన్న వయసు కలిగిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నానే గిల్టీ ఫీలింగ్‌తో బాధపడతాడు పృద్వి. తన పెళ్లి విషయాన్ని కూడా ఫ్రెండ్స్‌తో పంచుకోలేకపోతాడు. కానీ మేఘన మాత్రం వయసు తేడాలేవి పట్టించుకోకుండా నార్మల్‌గా ఉంటుంది. భర్తతో కలిసిపోవడానికి చాలా ప్రయత్నిస్తుంటుంది. కానీ పృద్వి మాత్రం ఆమె చిన్న పిల్ల అనే ఫీలింగ్‌లోనే ఉండిపోతాడు. మరి ఇలాంటి భిన్న కోణాలు కలిగిన భార్యాభర్తల జీవితం ఎలా సాగింది? ఈ క్రమంలో వారికి ఎదురైన చిలిపి కష్టాలు ఏంటి? పృద్వి మనసులో బలంగా నాటుకుపోయిన ‘ఏజ్‌గ్యాప్‌’అపోహ ఎలా తొలిగిపోయింది? అని తెలుసుకోవాలంటే యూట్యూబ్‌లో ‘30 వెడ్స్ 21’వెబ్‌ సిరీస్‌ చూడాల్సిందే.



ఎలా చేశారంటే..
30 ఏళ్ల బ్యాచిలర్‌ పృద్వి పాత్రలో ఒదిగిపోయాడు చైతన్య రావ్‌. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చాలా అద్భుతంగా నటించాడు. పెళ్లి విషయం బయటపెట్టకుండా ఉండేందుకు భార్య చెప్పే పనులు చేస్తూ నవ్వులు పూయించాడు. సహజంగా, అద్భుతంగా నటించి సిరీస్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక 21 ఏళ్ల మేఘన పాత్రలో అనన్య పరకాయ ప్రవేశం చేసింది. బ్రిలియెంట్ పెర్ఫామెన్స్‌తో ఔరా అనిపించింది. భర్త వీక్‌నెస్‌ని ఆసరాగా చేసుకొని ఆమె చేసిన చిలిపి తమషాలు ఈ సిరీస్‌కి హైలెట్‌ అని చెప్పొచ్చు. వీరితో పాటుగా కార్తీక్ అనే రోల్ కూడా నవ్వులు పూయించింది. మిగతా నటీ, నటులు తన పాత్రల పరిధి మేరకు నటించారు

ఎలా తీశారంటే..
30 ఏళ్ల బ్యాచిలర్‌కు, 21 ఏళ్ల యువతిని ఇచ్చి వివాహం జరిపితే..  వారి మధ్య భావోద్వేగాలు, చిలిపి తమాషాలు ఎలా ఉంటాయనే కాన్సెప్ట్‌తో వచ్చిన వెబ్‌ సిరీసే 30 వెడ్స్‌ 21. తొలుత 5 ఎపిసోడ్స్‌గా ప్లాన్‌ చేసిన దర్శకుడు పృథ్వీ వనం.. తాజాగా ఆరో ఎపిసోడ్‌ని కూడా విడుదల చేశాడు. ఈ ఆరు ఎపిసోడ్స్‌ కూడా చాలా ఫన్నీగా సాగుతాయి. ముఖ్యంగా మొదటి రెండు ఎపిసోడ్స్‌లో వచ్చే కామెడీకి పొట్టచెక్కలయ్యేలా నవ్వుతారు. కాన్సెప్ట్‌ కాస్త పాతదే అయినా.. డీల్‌ చేసిన విధానం చాలా ఫ్రెష్‌గా ఉంది. మొదటి రెండు ఎపిసోడ్స్‌ని ఎంటర్‌టైనింగ్‌గా మలిచిన దర్శకుడు... మిగతా ఎపిసోడ్స్‌ని కాస్త రొటీన్‌గా నడిపించాడు. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయినప్పటికీ.. ఎమోషన్స్‌ సీన్లు మాత్రం అంతగా పండలేదు.

అలాగే తాజాగా విడుదలైన ఎపిసోడ్‌ మరీ అంత ఇంట్రెస్టింగ్‌ అనిపించదు. ఇక సిరీస్‌కి మరో ప్రధాన బలం.. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే పలు  కామెడీ సన్నివేశాలను తనదైన స్పెషల్‌ బీజీఎంతో నవ్వులు పూయించాడు మ్యూజిక్‌ డైరెక్టర్‌ జోస్ జిమ్మీ. సినిమాటోగ్రఫీ బాగుంది. అలాగే నిర్మాణ విలువలు సిరీస్‌కి తగ్గట్లుగా ఉన్నాయి. మొత్తంగా డీసెంట్ కామెడీ అండ్ రొమాంటిక్ యాంగిల్‌లో వచ్చిన ఈ సిరీస్‌ని ఫ్యామిలీతో కలిసి చూస్తూ హ్యాపీగా ఎంజాయ్‌ చేయొచ్చు. 
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement