సాంకేతిక సమస్యలతో ఆగిన ‘ఆధార్‌’ | Sakshi
Sakshi News home page

సాంకేతిక సమస్యలతో ఆగిన ‘ఆధార్‌’

Published Thu, Aug 26 2021 4:26 AM

Aadhaar Stopped With Technical Issues In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విశిష్ట గుర్తింపు కార్డు ఆధార్‌ నూతన నమోదు, సవరణల ప్రక్రియ సాంకేతిక సమస్యల కారణంగా గత కొద్దిరోజులుగా నిలిచిపోయింది. యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) ఏర్పాటు చేసిన ఆధార్‌ నమోదు కేంద్రాల్లో (ఏఈసీ) జరిగే ఈ ప్రక్రియకు ఐదురోజులుగా అంతరాయం ఏర్పడింది. దీంతో కొత్త కార్డుల కోసం నమోదు, వేలిముద్రలు–ఐరిస్‌ అప్‌డేషన్, ఇప్పటికే జారీ చేసిన కార్డుల్లో మార్పులు, చేర్పులు తదితర అంశాల కోసం ఏఈసీలకు వస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 973 కేంద్రాలు ఈ సేవలందిస్తున్నాయి. రోజుకు సగటున లక్ష మంది వివిధ రకాల సేవల కోసం ఈ కేంద్రాలను సందర్శిస్తుంటారు. ప్రస్తుతం వీటిల్లో సేవలు నిలిచిపోవడంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. 

కేంద్రాల చుట్టూ చక్కర్లు.. 
రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రత కార్యక్రమంలో భాగంగా ఆసరా íపింఛన్లు ఇస్తోంది. ఇటీవల ఈ పథకం వయోపరి మితి నిబంధన సడలించి 57 సంవత్సరాలు దాటిన వారికి ఫించన్లు్ల ఇవ్వనున్నట్లు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పింఛన్ల మంజూరుకు ఆధార్‌ కార్డు వివరాలు కీలకంగా మారాయి. ముఖ్యంగా ఆధార్‌ కార్డులో ఉన్న పుట్టిన తేదీని పరిగణనలోకి తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం దరఖా స్తులకు ఆధార్‌ను జత చేయడం తప్పనిసరి చేసింది. దీంతో ఇప్పటివరకు ఆధార్‌ లేనివారు కొత్తగా నమోదు చేసుకునేందుకు, ఇప్పటికే ఉంటే వ్యక్తిగత వివరాల అప్‌డేషన్, పేర్లు, చిరునామాలు తదితరాల్లో తప్పులు ఉంటే సవరించుకునేందుకు ఏఈసీలకు వస్తున్నారు. అయితే ఐదురోజులుగా ఈ ప్రక్రియ నిలిచిపోవడంతో వయోవృద్ధులు ఆందోళనకు గురవుతున్నారు.

ఆధార్‌ జత చేసి దరఖాస్తు చేసుకోకుంటే పింఛ న్లు వచ్చే పరిస్థితి లేకపోవడంతో రోజూ ఆ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఆసరాతో పాటు పలు పథకాలు, అనేక వ్యవహారాలు/ లావాదేవీలకు ఆధార్‌ కార్డు తప్పనిసరి అ య్యింది. దీంతో ఇప్పటివరకు తీసుకోనివారు ఈ కేం ద్రాల్లో నమోదు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ప్రతి ఐదేళ్లకోసారి చేసుకోవాల్సిన బయోమెట్రిక్‌ అప్‌డేషన్‌కోసం కూడా చాలామంది ఈ కేంద్రాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఈ నేపథ్యంలో సాంకేతిక సమస్యల ను అధిగమించేందుకు యూఐడీఏఐ సంబంధిత ఇంజనీర్లను రం గంలోకి దింపింది. సర్వీసుల పురనరుద్ధరణ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది. అయితే ఎన్నిరోజుల్లో సర్వీసులు పునరుద్ధరిస్తామనే అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. 

ఐదు రోజులుగా తిరుగుతున్నా.. 
ఆధార్‌ కార్డులో పుట్టిన సంవత్సరం సవరణ కోసం ఐదు రోజులుగా ప్రయత్నిస్తున్నా. నగరంలోని కేంద్రాలతో సహా 20 సెంటర్లు తిరిగా. ఎక్కడా సర్వర్‌ పనిచేయట్లేదు. ఈ మార్పు చేసుకుంటేనే నేను ఆసరా పింఛన్‌కు దరఖాస్తు చేసుకోగలను. 
– కె.నర్సింహారెడ్డి, హన్మాస్‌పల్లి, రంగారెడ్డి జిల్లా 


 

 
Advertisement
 
Advertisement