‘‘అమిర్ ఖాన్ చేసే ప్రయోగాత్మక పాత్రలను నేను చేయలేను. నా సినిమాలు జనరంజకంగా, జనామోదంగా ఉండాలని ప్రయత్నిస్తుంటాను. నా ప్రమేయం లేకుండా కొన్ని సినిమాలు జరిగిపోతుంటాయి. ఆమిర్ ఖాన్ ‘లాల్‌సింగ్ చడ్డా’ను నేను సమర్పిస్తున్నందుకు గర్వపడుతున్నాను. అలాంటి కంటెంట్, ఎమోషన్ సినిమాలో ఉంది. కన్నీళ్లు పెట్టుకోం కానీ సినిమా చూస్తున్నప్పుడు చాలా చోట్ల కంటతడి, గుండె తడి ఉంటూనే ఉంటుంది’’ అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.
అమిర్ ఖాన్ టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘లాల్‌సింగ్ చడ్డా’. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కు హిందీ రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకుడు. కరీనా కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో నాగచైతన్య కీలక పాత్ర చేశారు. ఈ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కానుంది. తెలుగులో చిరంజీవి సమర్పిస్తున్నారు. ఆదివారం (జులై 24) హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో ‘లాల్‌సింగ్ చడ్డా’ తెలుగు ట్రైలర్‌ను చిరంజీవి, ఆమిర్ ఖాన్ రిలీజ్ చేశారు.
అనంతరం జరిగిన సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘2019లో జపాన్ ఎయిర్‌పోర్ట్‌లో నేను, అమిర్ కలిశాం. అప్పుడు ‘ఫారెస్ట్ గంప్’ను రీమేక్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ రీమేక్ ఆమిర్‌కు అవసరమా? అనే ఫీలింగ్ వచ్చింది కానీ ఆయన ప్యాషన్ చూసి కరెక్ట్ అనిపించింది. మనకు టామ్ హాంక్స్ (‘ఫారెస్ట్‌గంప్’లో హీరోగా నటించిన హాలీవుడ్ నటుడు) అంటే ఎవరో కాదు.. ఆమిర్ ఖాన్‌నే. ‘3 ఇడియట్స్’, ‘లగాన్’, ‘పీకే’ ‘దంగల్’.. ఇలా డిఫరెంట్ చిత్రాలు చేశారు ఆమిర్. ఇంత తపన ఉన్న నటుడు ఇండియాలో ఒక్క ఆమిర్ ఖానే ఉన్నారు. సినిమా మేకింగ్‌లో కర్త, కర్మ తానే అవుతారు. ఇలాంటి యూనిక్ స్టైల్ ఇండియాలో ఏ యాక్టర్‌లోనూ లేదు. మేం కూడా చేయాలనుకుంటాము. కానీ పరిమితులు ఉంటాయి. సో.. ఆయనలా మేం చేయలేం. అందుకే ఆయన అడగ్గానే ఆబ్లిగేషన్‌తో కాదు.. ఎంతో హానర్‌గా ‘లాల్‌సింగ్ చడ్డా’ని సమర్పించడానికి ఒప్పుకున్నాను’’ అన్నారు.
అమిర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘లాల్‌సింగ్ చడ్డా’ చూసి, నచ్చితే సమర్పించమని చిరంజీవిగారిని కోరాను. ఇప్పటివరకు ఏ సినిమాకూ ఆయన సమర్పకులుగా లేరని నాకు తెలుసు. మా సినిమాకు సమర్పకులుగా ఉన్నందుకు ఆయనకు ధన్యవాదాలు. నాగచైతన్య క్రమశిక్షణ చూసి, తనను బాగా పెంచారని చైతన్య అమ్మ లక్ష్మీగారికి ఫోన్ చేసి, మాట్లాడాను. ఈ సినిమాను మా అమ్మగారు చూశారు. ‘ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు’ అన్నారామె. నా కూతురు ఐరా ఎమోషనల్ పర్సన్. ఈ సినిమాను తను ఇంకా చూడలేదు ’’ అని తెలిపారు.
నాగచైతన్య మాట్లాడుతూ .. ‘‘ఈ చిత్రంలో గుంటూరుకు చెందిన బాలరాజు పాత్ర చేశాను. ఈ సినిమా కోసం వర్క్‌షాప్స్ చేశాం. ఇలా చేయడం నాకు కొత్త. ఈ సినిమాలో నా పాత్ర దాదాపు 30 నిమిషాలు ఉంటుంది. కొన్ని సినిమాల్లో పాత్ర ఎంతసేపు ఉందని కాదు.. కొన్ని మూమెంట్స్‌ను, ఎక్స్‌పీరియన్స్‌ను నేర్పిస్తాయి. యాక్టర్‌గా ఈ సినిమా నాకో ఇన్వెస్ట్‌మెంట్. ఆర్టిస్టుగా హెల్ప్ అవుతుందని ఈ సినిమా చేశాను’’ అని పేర్కొన్నారు.
చిరంజీవి: ఒకప్పుడు భారతీయ సినిమా అంటే హిందీ సినిమా అన్నట్లుగా చూపించారు. తెలుగు యాక్టర్‌గా కాదు... నేను ఇండియన్ యాక్టర్ అనిపించుకోవాలని హిందీలో ‘ప్రతిబంధ్, ఆజ్ కా గూండా రాజ్, జెంటిల్‌మెన్’ సినిమాలు చేశాను. కమల్‌హాసన్ ‘ఏక్ దూజే కే లియే’ వంటివి చేశారు. అయినా సౌత్ యాక్టర్స్‌గానే చూశారు. విశ్వనాథ్‌గారి ‘శంకరాభరణం’ నుంచి తెలుగు సినిమాకు గుర్తింపు వచ్చినా.. తర్వాత అలాంటి గుర్తుంపు వచ్చింది లేదు. రాజమౌళి ఆ హద్దులు చెరిపేశారు. సౌత్, నార్త్ అనే తేడాలు పోయాయి. ఏ భాషలో తీసినా సరే అది ఇండియన్ సినిమాయే. ఇలాంటి వాతావరణం రావాలని తపన పడ్డాను.
అమిర్ ఖాన్: చిరంజీవిగారు బాధపడ్డ ఆ సందర్భం గురించి నేను చదివాను. ఓ హిందీ యాక్టర్ అయిన నేను ఇప్పుడు ఆయన హెల్ప్ కోసం ఇక్కడికి వచ్చాను. దక్షిణాది సినిమాలు ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘పుష్ప’, ‘కేజీఎఫ్’లకు మంచి ఆదరణ లభించింది. నాకు తెలుగు సినిమా చేయాలని ఉంది. చిరంజీవిగారికి ఓసారి ఫోన్ చేసినప్పుడు సల్మాన్ తన సినిమాలో నటిస్తున్నట్లుగా చెప్పారు. నేను ఎందుకు గుర్తు రాలేదని ఆయనతో అన్నాను.
Comments
Please login to add a commentAdd a comment