మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఎంతో క్రేజీ ఉన్న హీరో. సినీ ఇండస్ట్రీలో ఆయన క్రియేట్ చేయని రికార్డులు లేవంటే అతిశయోక్తి కాదు. చిరు నుంచి సినిమా వస్తుంది అంటే చాలు.. టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచే సందడి స్టార్ట్ అవుతోంది. ఒక్కసారి ఆయన అడుగుపెడితే రికార్డుల రచ్చ మొదలవ్వాల్సిందే.ఇప్పుడు కూడా అదే జరిగింది. తాజాగా చిరు నటించిన ‘ఆచార్య’ సినిమా టీజర్ రిలీజ్ అయింది. శుక్రవారం(జనవరి 29) సాయంత్రం 4:05 గంటల విడుదలైన ఈ టీజర్ యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొడుతోంది. విడుదలై 30 నిమిషాల్లోనే లక్షా ఎనభై వేలకు పైగా వ్యూస్ అందుకుంది.అలాగే లక్షన్నరకు పైగా లైకులు సాధించింది. విడుదలైన నిమిషాలకే లక్షల్లో వ్యూస్ వస్తే.. గంటలు, రోజుల్లో మరెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో అని మెగా ఫ్యాన్స్ ఆతృతతో ఎదురుచూస్తున్నారు.
ఇక టీజర్ విషయానికి వస్తే.. కొరటాల శివ-చిరంజీవి కాంబినేషన్‌పై అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అదరగొట్టింది. ‘ఇతరుల కోసం జీవించేవారు దైవంతో సమానం. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పని లేదు’అంటూ మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ వాయిస్ ఓవర్‌తో టీజర్ మొదలవుతుంది. ‘పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో’ అని మెగాస్టార్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ అదుర్స్ అనిపించింది. విజువల్స్, చిరు ఫైట్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment