![Actor Arav Sher Vidaamuyarchi Old Incident With Ajith Kumar](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/ajith.jpg.webp?itok=WXWRFWXz)
నటుడు అజిత్ ప్రవర్తన చాలా భిన్నంగా ఉంటుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఒకరిని కించపరచడం, విమర్శలు చేయడం, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం వివాదాస్పద విషయాలకు చాలా దూరంగా ఉండటం ఆయన నైజం. తనేంటో తన పని ఏంటో చేసుకుంటూ పోయే మనస్తత్వం ఆయనది. కాగా తాజాగా ఆయన నటించిన విడాముయర్చి (పట్టుదల) చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది. నటి త్రిష నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది.
సినిమా బాగుందంటూ రివ్యూస్ కూడా వస్తున్నాయి. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలోని సీన్స్ హాలీవుడ్‌కు దగ్గరగా ఉన్నాయని ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే, ఈ మూవీ కోసం ఒక యాక్షన్ సన్నివేశాన్ని అజర్ బైజాన్‌లోని రోడ్లపై చిత్రీకరించినప్పుడు అజిత్ డ్రైవ్ చేస్తున్న కారు అనూహ్యంగా ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ వీడియో గతంలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. యావత్ చిత్ర పరిశ్రమని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటన గురించి ఈ చిత్రంలో ముఖ్యపాత్రను పోషించిన నటుడు ఆరవ్ మీడియాతో మాట్లాడారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/1_430.jpg)
'విడాముయర్చి చిత్రంలోని ఆ యాక్షన్ సన్నివేశాన్ని చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాం. అయినప్పటికీ అనూహ్యంగా కారు ప్రమాదానికి గురైంది. అయితే, ఆ తర్వాత జరిగిన ఘటనలే ఆశ్చర్యానికి గురి చేశాయి. కారు ప్రమాదం జరిగిన అర్ధగంట తర్వాత అజిత్ మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. ఆ సన్నివేశంలో అజిత్‌తో కలిసి నేను నటించాను. షూటింగ్ పూర్తి అయిన తర్వాత అజిత్ నన్ను వదిలేసి వెళ్లలేదు. ఆయనే స్వయంగా ఆసుపత్రికి తీసుకెళ్లి నా ఎక్సరే రిపోర్టు చూసిన తర్వాత ఏం జరగలేదని తెలుసుకుని రిలాక్స్ అయ్యారు.
నా భుజం తట్టి గట్టిగా ఆలింగనం చేసుకొని సారీ కూడా చెప్పారు. ఆ సమయంలో ఎంతో భావోద్వేగానికి గురైన నాకు చెప్పడానికి మాటలు కూడా రాలేదు. అదేవిధంగా అజిత్ ఆ తర్వాత కూడా డూప్ లేకుండానే నటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు బిలియన్ల సంఖ్యలో అభిమానులు ఉండడానికి కారణం ఇదే అని నాకు అప్పుడు అర్థమైంది' అని నటుడు ఆరవ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment