కమెడియన్, డైరెక్టర్, నిర్మాత, నటీనటులు, డ్యాన్సర్లు, సింగర్లు.. దాదాపు అందరూ ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నవారే. కొద్దోగొప్పో పాపులారిటీ వచ్చిందంటే చాలు సొంతంగా ఛానల్ పెట్టి అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు సెలబ్రిటీలు. అయితే కొన్నిసార్లు వారు చేసే వీడియోలు ఫ్యాన్స్‌కు తలనొప్పిగా మారుతున్నాయి. తాజాగా ఇదే కోవలోకి వచ్చాడు బాలీవుడ్ సీనియర్ నటుడు, కమెడియన్ గోవింద.
'ఆంఖెన్', 'రాజా బాబు', 'కూలీ నంబర్ 1', 'హీరో నంబర్ 1', 'దుల్హె రాజా' సినిమాల్లో నటించి కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోవింద గతేడాది గోవింద రాయల్స్ పేరిట యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. ఇందులో ఇప్పటివరకు రెండు పాటలు రిలీజ్ చేసిన ఆయన తాజాగా మూడో మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేశాడు. హల్లో అంటూ సాగే ఈ పాటను పాడింది, డైరెక్ట్ చేసింది ఆయనే కావడం విశేషం. అంతేకాదు, నిషా శర్మతో కలిసి డ్యాన్స్ చేశాడు గోవింద. ఇక ఇది చూసిన జనాలు ఇదేందయ్యా ఇది అని ఉలిక్కిపడుతున్నారు. ఈ పిచ్చిపాటలతో మమ్మల్ని చంపుకుతినొద్దంటూ ట్రోల్ చేస్తున్నారు.
'అతడి యాక్టింగ్‌కు పెద్ద ఫ్యాన్‌ను.. కానీ ఇలాంటి పిచ్చిపిచ్చి కంటెంట్‌తో వస్తుంటే చిరాకేస్తోంది. సైకియాట్రిస్ట్‌కు చూపిస్తే మంచిదేమో..', 'నిన్ను నువ్వు ఆత్మపరిశీలన చేసుకో.. జనాలు ఇప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నారు. మీరింకా మంచి పాత్రలు చేయాలనుకుంటున్నారు', 'ఇలా పరువు తీసుకోకుండా మీరు రిటైర్మెంట్ తీసుకోవచ్చు కదా, మీ ఫ్యాన్స్ అని చెప్పుకోవడానికే సిగ్గుపడేలా చేస్తున్నారు', 'ఇది 2022, ఇంకా 90లో ఉండకండి' అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం 'మీ డ్యాన్స్ అదిరిపోయింది సర్', 'లెజెండ్ ఎప్పటికీ లెజెండే' అంటూ పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment