క్యాస్టింగ్ కౌచ్ అన్నిచోట్లా ఉన్నా సినీ ఇండస్ట్రీలో మాత్రం ఈ పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది. క్యాస్టింగ్ కౌచ్ వల్ల తిప్పలు పడ్డ నటులెందరో ఉన్నారు. కొందరు దాన్ని అధిగమించలేక ఆగిపోతే మరికొందరు ఎదురు తిరిగి నిలబడి సక్సెస్ సాధించినవాళ్లున్నారు. ఆడవాళ్లే ఎక్కువగా దీన్ని ఫేస్ చేస్తారనుకుంటారు చాలామంది. కానీ అబ్బాయిలు కూడా అందుకు అతీతం కాదు. తాజాగా బాలీవుడ్ నటుడు జతిన్ సింగ్ జమ్వాల్ తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితుడినేనని చెప్తున్నాడు.
తాజాగా జతిన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'దేవుడి దయ వల్ల నాకు వెంటవెంటనే రెండు షోలు వచ్చాయని సంబరపడ్డాను. నా శ్రమకు గుర్తింపు లభించిందని సంతోషించాను. రెండు షోలు చేశాను, ఇక ఆఫర్లు అందుకోవడం చాలా ఈజీ అనుకున్నాను. కానీ నా అంచనా తప్పని రుజవైంది. రెండో షో తర్వాత మూడేళ్లు ఆన్ స్క్రీన్‌కు దూరమైపోయాను. దానికి గల కారణం ఆడిషన్స్ చేసేవాళ్లు నాలో ఉన్న టాలెంట్‌ను గుర్తించడానికి బదులుగా నాతో కాఫీ తాగాలని, నన్ను కలవాలని దురభిప్రాయాన్ని కలిగి ఉండటమే! నేనేమీ హీరో అవ్వాలని అనుకోలేదు. మంచి పాత్రలు చేయాలనుకున్నాను. కొన్నిసార్లైతే ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు నా ప్రొఫైల్ చూడటం మానేసి బయట కలుద్దామనేవారు. ఒకసారైతే మరీ దారుణ పరిస్థితి ఎదుర్కొన్నాను.
ఆయనొక పెద్ద క్యాస్టింగ్ డైరెక్టర్. ఓటీటీ షోల కోసం నటీనటులను ఎంపిక చేస్తుంటాడు. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండని అడిగాను. ఆయన వాట్సాప్‌లో నన్ను సెల్ఫీ దిగి పంపమన్నాడు. చెప్పినట్లే చేశాను. బాగానే ఉన్నావు, సాయంత్రం కలుద్దామన్నాడు. సరేనని కాఫీ షాప్‌కు వెళ్లాం. మామూలుగా మాట్లాడుతూ ఉంటే సడన్‌గా అతడు నా కాళ్లపై చేతులు వేశాడు. పబ్లిక్‌లో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నాకిలాంటివన్నీ నచ్చవని చెప్పాను. దానికతడు ఇక్కడ ఇలాంటివన్నీ మామూలే అంటూ చేయి కూడా తీయలేదు. వెంటనే ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి పారిపోయాను. చాలాకాలం పాటు ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయాను. ఈ సంఘటనను తల్చుకుని ఇంట్లో వెక్కి వెక్కి ఏడ్చాను. ఆయన అడిగినదానికి ఓకే చెప్పకపోవడంతో నాకు ఆ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం చేజారింది.
తర్వాత ఓసారి మరో క్యాస్టింగ్ డైరెక్టర్ దగ్గరకు వెళ్లాను. ఆయన నన్ను ఒంటి మీద బట్టలు లేకుండా కేవలం అండర్‌వేర్‌తో ఫోటో దిగి పంపించమన్నాడు. నేను షాకయ్యాను. ఆయనిలా చేశాడంటూ నేను మా ఫ్రెండ్స్‌కు, మిగతావాళ్లకు చెప్పడంతో అతడు నాకు మెసేజ్ చేయడం ఆపేశాడు. ఇండస్ట్రీలో ఇలాంటివి అడుగడుగునా ఉంటాయని అప్పుడే తెలిసొచ్చింది. కానీ ఇలాంటివి మానసికంగా మనల్ని కుంగదీస్తాయి' అని చెప్పుకొచ్చాడు జతిన్ సింగ్.
Comments
Please login to add a commentAdd a comment