ఆయన ఏ వేషం వేసినా.. దానికో ప్రత్యేక గుర్తింపు.
‘కోటన్నా..’ అని ముద్దుగా పిలుచుకునే సహచర నటులు
‘తంబీ, వారీ..’ అని ఆయన తెరపై పిలిచే పిలుపు.. ఆడియొన్స్‌కి వినసొంపు.
నైజాం యాస అయినా.. మిగతా భాషలైనా తన నటనకు తగ్గట్లుగా మార్చుకోవడం ఆయన తరీఖా.
కడుపుబ్బా నవ్వించడంలో.. క్రూరత్వంతో భయపెట్టించడంలో ఆయనదో ప్రత్యేకమైన మార్క్.
నటనకు పెట్టని ‘కోట’గా తెలుగు సినీ పరిశ్రమలో వెలుగొందుతున్న కోటా శ్రీనివాసరావు పుట్టినరోజు ఇవాళ!
సాక్షి, వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన డాక్టర్ కోట సీతారామాంజనేయులు సంతానమే కోటా శ్రీనివాసరావు. కోట 1945, జులై 10న జన్మించాడు. తండ్రిలా డాక్టర్ కాలేకపోయాడు.నటనపై ఇష్టంతో బ్యాంక్ ఉద్యోగాన్ని వదిలేసుకున్నాడు. నాటకాల నుంచి సినిమాలకు చేరుకున్నాడు. ‘ప్రాణం ఖరీదు’తో మొదలైన ఆయన నటన.. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో అప్రతిహితంగా కొనసాగింది. క్యారెక్టర్ ఏదైనా సరే దానికొక మేనరిజం తగిలించి ఆకట్టుకోవడం ఆయనకున్న ప్రత్యేకత. ఇప్పటిదాకా దాదాపు ఎనిమిది వందల సినిమాల దాకా నటించిన(అంతకు మించి) కోట.. ప్రతీ సినిమాలో వేరియేషన్ కనబరుస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ వస్తున్నారు.
.
విలన్ మాత్రమే కాదు..
తొలినాళ్లలో సైడ్‌కిక్ వేషాలేసిన కోట.. క్రమంగా విలన్ వేషాల వైపు మళ్లాడు. ప్రతిఘటన ‘యాదగిరి’ కోట నటనను ఆడియెన్స్‌కు దగ్గర చేయడంతో పాటు మొదటి నంది అవార్డును ఇప్పించింది. అయితే ఆయన మరుసటి సినిమానే ఆయన నుంచి ఊహించని ‘కామెడీ’ అనే కోణాన్ని పరిచయం చేసి ఆ టైంకి లక్షల మందిని.. తర్వాతి కాలంలో కోట్లమందిని కోటకు అభిమానులు చేసింది. ఆ సినిమా పేరు ‘ఆహానా పెళ్లంట’. పిసినారి లక్ష్మీపతి పాత్రలో ఆయన నటన మార్వెలెస్. ఇక ఆ తర్వాత వరుసగా విలన్ పాత్రల్లోనే మెప్పించిన ఆయన.. మధ్యమధ్యలో కామెడీ మిక్స్ చేసిన విలనిజంతోనే అలరించాడు. కొన్ని పాత్రలకైతే ఆయన తప్ప మరెవరూ సరిపోరని అప్పటి దర్శకులు ఫిక్స్ అయ్యేవారంటే అతిశయోక్తి కాదు. అంతెందుకు ‘గణేశ్’ హోం మినిస్టర్ సాంబ శివుడు లాంటి పాత్రల్లోనైతే కోటను తప్ప మరొకరిని ఊహించుకోవడం మనకైనా కొంచెం కష్టమే!.
అన్నాయ్..
తొంభై దశకంలో కోట సినీ ప్రయాణం ప్రయాణం జెట్ స్పీడ్‌తో సాగింది. మెయిన్ విలన్, కామెడీ విలన్‌గానే కాకుండా.. విలన్ పక్కన ఉంటూ ‘గోడ మీద పిల్లి’ తరహా క్యారెక్టర్లతో అలరించారాయన. ఆ టైంలో వచ్చిన బాబు మోహన్-కోట శ్రీనివాసరావు కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘అన్న.. అన్నాయ్..’ అంటూ కోటను బాబు మోహన్ బురిడీ కొట్టించడాలు, వెనక్కి తిరిగి తన్నడాలు.. సన్నివేశాల్ని రిపీట్ మోడ్‌లో చూసి నవ్వుకునే వాళ్లూ ఇప్పటికీ ఉంటారు. మిగిలిన దర్శకుల మాటేమోగానీ.. కోటలోని కామెడీ కోణాన్ని దర్శకుడు ఇవీవీ వాడుకున్నంతగా ఇంకెవరూ వాడుకోలేకపోయారు. ఇక బ్రహ్మీ, ఎమ్మెస్ నారాయణ కాంబోలోనూ కోట నుంచి హెల్తీ హ్యూమరే జనాలకు అందింది.
మందు పడితేనే ఆ సీన్ పండిందట
కోటకు వివాదాలు కొత్తేం కాదు. పరభాష నటులను విలన్లుగా తీసుకోవడంపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. ఆయన కూడా ఇతర భాషల్లో నటించిన ప్రస్తావనతో విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే నటన రానీ వాళ్లను తీసుకోవడం గురించే తాను మాట్లాడానని తర్వాత క్లారిటీ ఇచ్చారు కోట. ఇక కోటకు మద్యం బలహీనత ఉందని, తాగి సెట్‌కి వస్తారని, దీంతో కొందరు ఆర్టిస్టులు ఇబ్బందిగా ఫీలయ్యేవారన్న అపవాదు కోట మీద ఉంది. అయితే సిచ్యుయేషన్‌కి తగ్గట్లు కొన్నిసార్లు అది తప్పదనే కోట సమర్థనను బలపరిచిన వాళ్లూ లేకపోలేదు. అందుకు ఉదాహరణగా శుత్రువు టైంలో జరిగిన ఓ ఘటను గుర్తు చేస్తారు. విలన్ క్యారెక్టర్ కోసం.. అప్పటికే ఇద్దరు యాక్టర్లను మార్చేసిన కోడిరామకృష్ణ చివరికి కోట దగ్గర ఆగిపోయాడు. అయితే ఒక సీన్ తీస్తున్న టైంలో కోట పదే పదే టేకులు తీసుకుంటుండడంతో అంతా విసిగిపోయారట. చివరికి పక్కకు వెళ్లి మందేసి వచ్చిన కోట.. తర్వాత ఆ సీన్‌లో చెలరేగిపోయాడు. ఆ సీన్‌కు ఆడియొన్స్ నుంచి మంచి రియాక్షన్ వచ్చిందని దర్శకుడు కోడిరామకృష్ణ సైతం కొన్ని సందర్భాల్లో ప్రస్తావించడం విశేషం.
గదైతే ఖండిస్తం
కోట నుంచి వెలువడే డైలాగులు చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయి. రాజకీయ నేపథ్యాల్లోని సినిమాల్లో కోట నటన గురించి ప్రత్యేకంగా చెప్పకోవాలి. పొలిటీషియన్‌గా ఆయన నటన మరింత ప్రత్యేకంగా తెరపై కనిపిస్తుంటుంది. ప్రతిఘటన నుంచి మొదలై శత్రువు, గాయం, గణేశ్, లీడర్, ఛత్రపతి, మున్నా, ప్రతినిధి, తమిళ్ సామి, కో(రంగం), సర్కార్(హిందీ) సినిమాల్లో మరీ ముఖ్యంగా రాజకీయాలపై ఆయన నోటి నుంచి వెలువడే డైలాగులు ఎప్పటికీ గుర్తిండిపోతాయి.
గొంతుతోనూ మ్యాజిక్
90 దశకంలో, 2000 సంవత్సరాల్లోనూ తన డబ్బింగ్ వాయిస్‌తో కోట అలరించాడు. ముఖ్యంగా తమిళ కమెడియన్ గౌండ్రమణి(అవతల సెంథిల్‌కు బాబు మోహన్)కి ఆయన అరువిచ్చిన గొంతు తెలుగు ప్రేక్షకులకు మైమరిపించింది. అంతేకాదు సీనియర్ నటుడు మణివణ్ణన్‌కు సైతం ఆయన కోట కొన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment