![Actor Parthiban and Seetha openly started reason for breaking - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/21/11_0.jpg.webp?itok=yJkmHOSt)
ప్రేమ వివాహం చేసుకుని ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులైన దర్శక నటుడు పార్తీపన్, నటి సీత మనస్పర్థల కారణంగా 11 ఏళ్ల క్రితం విడిపోయిన విషయం తెలిసిందే. తాజాగా తాము విడిపోవడానికి సీతనే కారణమని పార్తీపన్, ఆయన చెప్పినదంతా అబద్ధమని సీత ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వార్తల్లోకి ఎక్కడం చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. పాండ్యరాజన్ దర్శకుడిగా, కథానాయకుడిగా పరిచయం అయిన ఆన్‌పావం చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయిన నటి సీత. తొలి చిత్రంలోనే పక్కింటి అమ్మాయిగా ముద్ర వేసుకున్న ఈమె ఆ తరువాత వరుసగా తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం తదితర భాషల్లో అవకాశాలు దక్కించుకుని హీరోయిన్‌గా మంచి స్థాయికి చేరుకున్నారు. దర్శకుడు భాగ్యరాజ్ శిష్యుడు పార్తీపన్ తొలిసారిగా స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా పరిచయమైన పుదియపాదై చిత్రంలో సీత నాయకిగా నటించారు. ఆ చిత్రంలో వీరిద్దరి మధ్య ప్రేమ నడచింది. దీంతో 1990లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే మనస్పర్థల కారణంగా 2001లో విడిపోయారు.
ఆ తరువాత సీత 43 ఏళ్ల వయసులో బుల్లితెర నటుడు సతీష్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే కొద్ది కాలంలోనే వీరిద్దరూ విడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో సీత మొదటి భర్త పార్తీపన్ ఆమె గురించి ఒక కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాము విడిపోవడానికి కారణం సీత అత్యాసే కారణమని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై సీత స్పందించారు. తాను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన నటిని అని, ఒక చిత్రంలో నటి సుహాసిని చెప్పినట్లు నా భర్త నాకే సొంతం అని ఆశించడం తప్పా అని ప్రశ్నించారు. పార్తీపన్ చెప్పినవన్నీ అసత్యాలే అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment