నటుడు రఘువరన్ పేరు వినగానే ఆయన విలక్షణమైన పాత్రలు ముందుగా మన మనసులో మెదలుతాయి. తాను ధరించిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి, జనాన్ని ఇట్టే కట్టిపడేయడంలో మేటి అనిపించుకున్నారు రఘువరన్. దక్షిణాది భాషలన్నిటా రఘువరన్ నటించి మెప్పించారు. కొన్ని హిందీ చిత్రాలలోనూ రఘువరన్ అభినయం ఆకట్టుకుంది. విలక్షణ నటునిగా జనం మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు రఘువరన్. చివరి రోజుల్లో ఆల్కహాల్‌కు బానిస అయిన రఘువరన్ 2008 మార్చి 19న కన్నుమూశారు. ఇదే విషయంపై తాజాగా ఆయన తమ్ముడు పలు ఆసక్తకరమైన వ్యాఖ్యలు చేశాడు.
కుమారుడిపై అమితమైన ప్రేమ
మీడియాకు ఎప్పుడూ దూరంగా ఉండే రఘువరన్ సోదరుడు తొలిసారిగా ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. లైమ్ లైట్‌కు ఎప్పుడూ దూరంగా ఉండే రఘువరన్ గురించి చాలా మందికి తెలియదు. అయితే తాను ఎప్పుడూ రఘువరన్‌తోనే ఉండేవాడినని ఆయన తెలిపారు. 'అన్నయ్య చనిపోయిన రోజు నేను బెంగళూరులో ఉన్నాను. ఆరోజు రాత్రి తనకు ఛాతీ నొప్పి వస్తున్నట్లు తెలపడంతో ఇంట్లోని పనివారు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అన్నయ్య చనిపోయాడని వైద్యులు తెలిపారు.
అన్నయ్య మరణానికి ముందే కుటుంబంలో కొన్ని సమస్యలు ఉండేవి. దాని గురించి అందరికీ తెలుసు. అది అతనికి బాధ కలిగించింది. మానసికంగా, శారీరకంగా బాగా అలసిపోయాడు. అతను తన కొడుకును చాలా ప్రేమించాడు. అన్నయ్య,రోహిణి వేరువేరుగా ఉండటంతో వారంలో శనివారం మాత్రమే తన కుమారుడిని ఇంటికి తీసుకొచ్చుకునే అవకాశం ఉండేది. ఆదివారం తిరిగి వాళ్లు తీసుకుపోతారు. అది కోర్టు నిబంధన. కొడుకు పరుగున రాగానే నాన్న.. అని అంటాడు.
(ఇదీ చదవండి: విశాల్‌పై పగ ఎప్పటికీ తగ్గదు.. సూర్య వెనకున్న శక్తి ఎవరంటే: అబ్బాస్)
అప్పుడు ఆయన కన్నీరుపెట్టేవాడు. తన కుమారుడు ఎప్పుడైతే తిరిగి వెళ్లిపోతాడో అప్పుడు విపరీతంగా బాధపడేవాడు. అలా తన చివరి రోజుల్లో ఎంతగానో క్షోభను అనుభవించాడు. దాంతో మద్యానికి మరింత బానిస అయ్యాడు.' అని ఆయన గుర్తుచేసుకున్నాడు. అయితే అతను మద్యానికి బానిస కావడానికి కొన్ని వ్యక్తిగత కారణాలున్నాయి. అంటూనే పరోక్షంగా రోహిణినే అని తెలుపుతూ దీనిపై మాట్లాడే ఆసక్తి లేదని రఘువరన్ సోదరుడు తెలిపారు.
రోహిణితో పెళ్లి
నటి రోహిణితో రఘువరన్ వివాహం 1996లో జరిగింది. వారిద్దరికీ రిషి వరణ్ అనే కొడుకు ఉన్నాడు. అయితే 2004లో రఘువరన్, రోహిణి విడిపోయారు. విడిపోవడానికి గల కారణాలను రోహిణి అప్పట్లో బయటపెట్టింది. రఘువరన్ తాగుడు ముందు తాను, తన కొడుకు ఓడిపోయామని రోహిణి అప్పట్లో చెప్పింది. రఘువరన్ ఎంతో ఇష్టంగా కంపోజ్ చేసి, పాడిన ఆరు పాటలను ఆయన మరణం తరువాత ఓ ఆల్బమ్‌గా తీసుకువచ్చారు. రజనీకాంత్ చేతులమీదుగా విడుదలైన ఈ ఆల్బమ్‌ను ఆయన భార్య రోహిణి, తనయుడు రిషి వరన్ అందుకున్నారు. ఏది ఏమైనా రఘువరన్ విలక్షణమైన అభినయం జనం మదిలో ఓ స్థానం సంపాదించింది.
(ఇదీ చదవండి: గుండెపోటుతో ప్రముఖ హీరో భార్య మృతి.. దిగ్భ్రాంతి చెందిన సీఎం)
Comments
Please login to add a commentAdd a comment