దళపతి విజయ్ 'తమిళగ వెట్రి కళగం' పేరుతో పార్టీని ప్రారంభించడంతో తమిళనాట పాలిటిక్స్ మరింత ఆసక్తికరంగా మారాయి. అయితే విజయ్ సొంతంగా మాట్లాడకుండా తన తరఫున బుస్సీ ఆనంద్ మీడియా ద్వారా ప్రకటనలు చేస్తే గెలవరని నటుడు, నిర్మాత కె.రాజన్ అన్నారు. ఆయన ప్రజల్లోకి రావాలని ఆకాంక్షించారు. ఎంజీఆర్ ప్రజలకు చేసిన సేవల్లో 30 శాతం చేస్తే విజయ్ రాజకీయాల్లో రాణిస్తారన్నారు. ఆయన ప్రజలకు మంచి చేస్తారని భావిస్తున్నానన్నారు. నినైవెల్లా నీయడా చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై కె.రాజన్ పై వ్యాఖ్యలు చేశారు.
ఇళయరాజా సంగీతం..
లేఖా క్రియేటర్స్ పతాకంపై రాయల్ ప్రభు నిర్మించిన చిత్రం నినైవెల్లా నీయడా. సెటిలైంది, రణతంత్ర, ఆరువా సౌండ్ వంటి హిట్ సినిమాల ఫేమ్ ఆదిరాజన్ ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు రాసి దర్శకత్వం వహించారు. ప్రాజన్, మనీషాయాదవ్ జంటగా నటించగా రాజా భట్టార్జి చాయాగ్రహణం, ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఇది ఇళయరాజా సంగీతం అందించిన 1,417వ చిత్రం కావడం విశేషం. చిత్ర ఆడియో లాంచ్ మంగళవారం సాయంత్రం నిర్వహించారు.
ఆయన్ను కలవడమే కష్టమన్నారు..
ఈ కార్యక్రమంలో నటుడు, నిర్మాత కె.రాజన్, దర్శకుడు పేరరసు, ఆర్వీ ఉదయకుమార్, నిర్మాత కేఆర్ సినీ ప్రముఖులు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. చిత్ర దర్శకుడు ఆదిరాజన్ మాట్లాడుతూ.. ఇది మధురైలో తన మిత్రుడి జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన ప్రేమ కథా చిత్రం అని చెప్పారు. ఇందులో 70 శాతం వాస్తవం కాగా 30 శాతం కల్పితమని పేర్కొన్నారు. ఇళయరాజాను చేరడమే కష్టమని కొందరు చెప్పారని, అలాంటిది ఈ చిత్రానికి ఆయన సంగీతాన్ని అందించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఇళయరాజాతో పనిచేయడం మంచి అనుభవంగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment