
పెళ్లవగానే హీరోయిన్లను పక్కన పెట్టేసే ధోరణి సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ బాలీవుడ్‌లో అలా కాదు.. పెళ్లయినా, పిల్లలున్నా సరే పలువురు కథానాయికలు అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీనే ఏలుతారు. ఆలియా భట్ (Alia Bhatt) హిందీ చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. ఆమెను చూస్తే ఈర్ష్యగా ఉందంటోంది బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీ ఖాన్.
లైఫ్ సెట్టయిపోయిందనుకున్నా
ఎన్‌డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సారా అలీ ఖాన్ (Sara Ali Khan) మాట్లాడుతూ.. ఆలియాకు జాతీయ అవార్డు వచ్చినప్పుడు నా ఫీలింగ్ ఏంటో తెలుసా? ఆలియా అవార్డు గెలిచింది.. అటు తనకు పాప కూడా ఉంది. ఇంకేంటి? తన లైఫ్ సెట్టయిపోయింది అనుకున్నాను. కానీ ఆ స్థాయికి చేరుకోవడానికి తను ఎంత కష్టపడిందన్నది ఆలోచించలేదు. నటిగా మానవత్వం మరిచిపోయాననిపించింది. తను ఎన్ని కష్టాలు పడింది.. ఎన్నిసార్లు నిరాశకు గురైందన్నది మనకు తెలియదు.
ఆ సక్సెస్ మనకెందుకు లేదని..
నాణానికి రెండువైపులా చూడాలి. మనలా చాలామంది అవతలివారి గురించి తెలుసుకోకుండా ఊరికే కుళ్లుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారి సక్సెస్ చూసి మనకెందుకు రాలేదా? అన్న ఈర్ష్య వస్తుంది. కానీ ఆ సక్సెస్ వెనక ఉన్న శ్రమను గుర్తించం. అసూయ చెందడం అంటే కళ్లు మూసుకుపోవడంతో సమానం అని సారా చెప్పుకొచ్చింది.
సినిమా..
కాగా ఆలియా భట్.. 2022లో రణ్‌బీర్ కపూర్‌ను పెళ్లాడింది. అదే ఏడాది వీరికి రాహా అనే కూతురు జన్మించింది. గంగూబాయ్ కథియావాడి చిత్రానికిగానూ ఉత్తమనటిగా 2023లో జాతీయ అవార్డు అందుకుంది. సారా అలా ఖాన్ విషయానికి వస్తే.. ఈమె చివరగా స్కై ఫోర్స్ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం మెట్రో ఇన్ డినో అనే మూవీ చేస్తోంది. అనురాగ్ బసు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జూలై 4న విడుదల కానుంది.
చదవండి: బెట్టింగ్ యాప్స్.. ఏడాదికి రూ.10 లక్షలిస్తామన్నారు: వాసంతి