తమిళసినిమా: సీనియర్ నటుడు, హీరో సూర్య తండ్రి శివకుమార్ గొప్ప నటుడు అన్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఉత్తమ నటుడుగా కంటే మంచి చిత్ర కళాకారుడు అనిపించుకోవడమే గర్వంగా భావిస్తారు. శివకుమార్ మంచి చిత్రకారుడు అన్న విషయం తెలిసిందే. నాలుగు దశాబ్దాలకు పైగా కథానాయకుడిగా సాంఘిక, చారిత్రక, పౌరాణిక కథా చిత్రాలు చేసి శభాష్ అనిపించుకున్న శివకుమార్ నటనకు స్వస్తి చెప్పి దశాబ్దంన్నరకు పైనే అయ్యింది. అయితే ఆయన ప్రశాంతి దశలో మాత్రం లేరు.
కంబ రామాయణం, మహాభారతం వంటి పురాణం గ్రంథాలను అవపోసన చేసి వేదికలపై గంటల తరబడి ప్రవచనాలు చెబుతూ ప్రేక్షకులను ఉత్తేజ పరుస్తున్నారు. తాజాగా తిరుక్కురళ్ 100 పేరుతో ముఖ్య అంశాలకు తన జీవిత అనుభవాలను జోడించి ఓ గ్రంథాన్ని రచించారు. దానిని ఇటీవల ఈరోడ్‌లో వేలాదిమంది ప్రేక్షకుల సమక్షంలో ఏకధాటిగా ఉపన్యసించి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఇంతకుముందు పరిధి పరిమేలముగర్ నుంచి సాల్మన్ పాపయ్య వరకు పలువురు ప్రముఖ రచయితలు తిరుక్కురళ్‌కు పరిభాషను రచించారు.
అయితే తిరుక్కురళ్‌లోని ముఖ్య అంశాలకు తన అనుభవాలను జోడించి రచించింది నటుడు శివకుమారేనని అభినందనలు అందుకుంటున్నారు. కాగా ఈయన రాసి, ఉపన్యసించిన తిరుక్కురళ్ 100 కార్యక్రమాన్ని పుదియ తలైమురై టీవీ ఛానల్ సంక్రాంతి సందర్భంగా ఈ నెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ప్రచారం చేయనుంది. అదే విధంగా పుదుయుగం ఛానల్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26వ తేదీన ఉదయం 10 గంటల నుంచి ప్రచారం చేయనుందని నటుడు శివకుమార్ శనివారం సాయంత్రం చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment