సింగంగా శత్రువులపై విరుచుకుపడ్డ నటుడు సూర్య. సూరరై పోట్రు చిత్రంలో తాను అసాధారణను నటనను ప్రదర్శించి జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు పొందారు. ఇక జై భీమ్ చిత్రంలో కొండప్రాంత ప్రజల కోసం న్యాయ పోరాటం చేసే పాత్రలో మెప్పించారు. ఇలా ఒక్కో చిత్రంలో ఒక రకమైన వైవిధ్యభరిత నటన ప్రదర్శిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న సూర్య తాజాగా శివ దర్శకత్వంలో తన 42వ చిత్రంలో నటిస్తున్నారు. ఈయన ప్రతిసారి తన నట తృష్ణను తీర్చుకోవడానికి సొంత నిర్మాణ సంస్థనే ఎంచుకుంటున్నారని చెప్పవచ్చు. అలాంటిది పలు ప్రత్యేకతలతో కూడిన తన 42వ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలకు చేయడం విశేషం.
ఇప్పటి వరకు దక్షిణాది భాషల వరకే పరిమితం అయిన ఈయన ఈ తాజా చిత్రంతో ఉత్తరాదిని కూడా టార్గెట్ చేసేటట్లు అనిపిస్తోంది. దీంతో బాలీవుడ్ క్రేజీ నటి దిశ పఠాని కథానాయకిగా ఎంపిక చేశారు. ఇతర ముఖ్యపాత్రల్లో యోగిబాబు, కిన్ల్సి, కోవై సరళ, ఆనంద్‌రాజ్ తదితరులు నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని 3డీ ఫార్మెట్లో రూపొందించడం మరో విశేషం. చిత్రం చారిత్రక కథలతో మొదలై నేటి తరం వరకు సాగుతుందని సమాచారం. కాగా ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రాన్ని 10 భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది.
మరో ముఖ్య అంశం ఏమిటంటే ఇందులో సూర్య ఏకంగా 13 పాత్రల్లో నటిస్తున్నట్లు తాజా సమాచారం. ఇది పెద్ద రికార్డే అవుతుంది. ఇంతవరకు 10 పాత్రలకు మించి ఎవరూ చేయలేదు. నవరాత్రి చిత్రంలో శివాజీ గణేషన్ 9 పాత్రలు పోషిస్తే దశావతారం చిత్రంలో కమలహాసన్ ఆ రికార్డును అధిగమించి 10 పాత్రల్లో నటించారు. ఇప్పుడు సూర్య తన 42వ చిత్రంలో 13 పాత్రలు పోషించడం కచ్చితంగా రికార్డే అవుతుంది. కాగా ఈ క్రేజీ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలకల్లా పూర్తి చేయనున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. కాగా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌కి పరిశ్రమ వర్గాల నుంచి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. దీంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడం సహజమే.
Comments
Please login to add a commentAdd a comment