నా పరువు నిలబెట్టావ్‌... గర్వంగా ఉందన్నారు | Actor Vaishnav Tej Press Meet About Uppena Movie | Sakshi
Sakshi News home page

నా పరువు నిలబెట్టావ్‌... గర్వంగా ఉందన్నారు

Feb 9 2021 12:37 AM | Updated on Feb 9 2021 7:20 AM

Actor Vaishnav Tej Press Meet About Uppena Movie  - Sakshi

‘‘ఏ పనినైనా ప్రేమతో చేస్తూ వంద శాతం కష్టపడతాను. అది ప్యాషన్‌ కూడా అయ్యుండొచ్చు. దాన్ని కూడా ప్రేమ అనే అనుకుంటాను. అందరిలా నాకు ఫెయిల్యూర్‌ భయం ఉంటుంది’’ అని వైష్ణవ్‌ తేజ్‌ అన్నారు. చిరంజీవి మేనల్లుడు, సాయితేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ  మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ నిర్మించిన సినిమా ‘ఉప్పెన’. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో వైష్ణవ్‌ తేజ్‌ చెప్పిన విశేషాలు.


► నా లైఫ్‌ జర్నీ కాస్త అటూ ఇటూగా ఉంటుంది. మొదట్లో యాక్టింగ్‌ అంటే నాకు ఇంట్రెస్ట్‌ లేదు. సైంటిస్ట్, ఆస్ట్రోనాట్, ఫార్ములా రేసర్, ఫొటోగ్రాఫర్, 3డీ యానిమేటర్, మూవీ డైరెక్టర్‌... ఇలా చాలా అనుకున్నాను. నా కెరీర్‌ను నేను డిసైడ్‌ చేసుకోవడానికి చాలా టైమ్‌ పట్టింది. ఓ నాలుగైదేళ్లు నాలో నేను మదనపడ్డాను. లైఫ్‌లో ఏం చేయాలో సరిగా అర్థం కావడం లేదని అమ్మతో చెబుతుండేవాడిని. అసలు ఇవన్నీ ఎందుకు? నలుగురికి ఉపయోగపడకుండా ఈ ప్రాణాలు వృథాగా పోవడం దేనికి అని ఆర్మీకి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాను. ఆర్మీ అప్లికేషన్, అర్హతలను గురించి ఇంటర్‌నెట్‌లో బ్రౌజింగ్‌ చేశాను.

► ఆర్మీకి వెళ్లడానికి సన్నబడ్డాను. సోషల్‌ మీడియాలో ఆ ఫొటోలను సరదాగా షేర్‌ చేశాను. సినిమాల్లో ఆఫర్స్‌ వచ్చాయి. ‘నాకేమీ రాదు. నేర్పిస్తే చేస్తాను. వంద శాతం కష్టపడతాను’ అని చెప్పాను. ఆ సినిమాలు ఎందుకో వర్కౌట్‌ కాలేదు. ఆ సమయంలో బుచ్చిగారు ‘ఉప్పెన’ సినిమా కథతో వచ్చారు. కథ నచ్చింది. అయితే చేయగలనా? అనిపించింది. చిరంజీవి మావయ్యకు చెప్పాను. ‘చాలామంది అవకాశాల కోసం స్ట్రగుల్‌ అవుతుంటారు. నీకొచ్చిన అవకాశాన్ని గౌరవించి ప్రయత్నించు. ఒకవేళ నిన్ను నువ్వు ప్రూవ్‌ చేసుకోలేకపోతే అప్పుడు వేరే ఏదైనా ట్రై చెయ్‌’ అన్నారు. ఇలా ఎవరూ నాకు చెప్పలేదు. అది నాకు బాగా స్ట్రయిక్‌ అయ్యింది. మా మామయ్యల మాట నాకు అల్టిమేటమ్‌. నేను కూడా ఆలోచిస్తాను. కానీ వారి మాట వింటాను.

► నెల రోజులు యాక్టింగ్‌ క్లాసులకు వెళ్లాను. హీరో క్యారెక్టర్‌ యాస, పాత్ర కోసం దాదాపు 40 రోజులు కష్టపడ్డాను. ఈ సినిమా సెట్‌లో నేను చాలా నేర్చుకున్నాను. విజయ్‌ సేతుపతిగారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. నటనలో నాకు కొన్ని మెళకువలు చెప్పారు. సినిమా షూటింగ్‌ పూర్తి చేసి వెళ్లే ముందు మా టీమ్‌లో కొంతమందికి వెయ్యి రూపాయలు చొప్పున ఇచ్చారు. ఇన్‌స్పైరింగ్‌ పర్సనాలిటీ. కృతీశెట్టి వారంలో తెలుగు నేర్చుకునే ప్రయత్నం చేసి, తెలుగులో డైలాగ్స్‌ చెప్పింది. అది చూసి నేను కూడా ఇతర భాషలు నేర్చుకోవాలని అనుకున్నాను.

► దేవిశ్రీ ప్రసాద్‌గారు అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు. మా సినిమాకు ఇంత బజ్‌ రావడానికి ముఖ్య కారణం ఆయనే. ‘ఉప్పెన’ ఓటీటీలో విడుదలవుతుందేమోనని నేను కూడా అనుకున్నాను. డైరెక్టర్‌ బుచ్చిబాబు థియేటర్స్‌లోనే విడుదల చేయాలని పట్టుబట్టారు. అలాగే టీమ్‌ కూడా సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేద్దామని అనుకున్నారు. క్లైమాక్స్‌ గురించి సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. సినిమా చూసినప్పుడు ప్రేక్షకులకు అర్థం అవుతుంది. ప్రేమకథా చిత్రాలు చాలా వచ్చాయి. కానీ ‘ఉప్పెన’ డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక ప్రత్యేకమైన పాయింట్‌ ఉంది. సినిమా అందరికీ నచ్చుతుంది.  

► జానీ, శంకర్‌దాదా, అందరివాడు సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్టుగా చేశాను. చిన్నప్పుడు బాగా సిగ్గుగా ఉండేవాడిని. ఇప్పుడు నాలో మార్పు వచ్చింది. నాకు యాక్ష¯Œ  సినిమాలంటే ఇష్టం. హిందీ చిత్రం ‘ఉరి: ది సర్జికల్‌స్ట్రైక్‌’ లాంటి సినిమాలంటే ఇష్టం. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా వస్తే చేస్తాను.

► ప్రతి సినిమాను నేను కొత్తగానే భావిస్తాను. ‘ఉప్పెన’ సినిమాలో నేను చేసిన పాత్ర వేరు. క్రిష్‌గారి డైరెక్షన్‌లో రూపొందిన సినిమాలో చేసిన క్యారెక్టర్‌ వేరు. కొన్ని కొత్త ఆఫర్స్‌ ఉన్నాయి. వాటి గురించి త్వరలో చెబుతాను.

► నాకు ఫ్యామిలీ సపోర్ట్‌ ఉంది. ‘ఉప్పెన’ సినిమాను మా కుటుంబసభ్యులు చూశారు. ‘నాకు చాలా గర్వంగా ఉంది రా.. నా పరువు నిలబెట్టావ్‌’ అని చిరంజీవిగారు బెస్ట్‌ కాంప్లిమెంట్‌ ఇచ్చారు.

► ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో చాలా బాగా మాట్లాడానని చాలామంది అంటున్నారు. అలా మాట్లాడతానని నేను కూడా ఊహించలేదు. క్యాలిక్యులేటెడ్‌గా మాట్లాడటం నాకు రాదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement