డీఎండీకే అధినేత, సినీ నటుడు విజయకాంత్ ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయనకు చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలోచికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారంతో డీఎండీకే వర్గాల్లో ఆందోళన నెలకొంది. డీఎండీకే అధినేత విజయకాంత్ సినీ, రాజకీయ పయనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అనారోగ్య కారణాలతో ఆయన ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. పార్టీ బాధ్యతలను కోశాధికారి పదవితో ఆయన సతీమణి ప్రేమలత విజయకాంత్ భుజాన వేసుకుని ముందుకెళ్తున్నారు.
ఈ పరిస్థితులలో విజయకాంత్‌ను చూడలేక పోతున్నామే అన్న ఆవేదనలో ఉన్న కేడర్‌కు ఇటీవల ఆయన దర్శనం కల్పించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన తన జన్మదిన వేడుకకు విజయకాంత్ హాజరయ్యారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిని చూసిన కేడర్ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత నుంచి ఇంట్లోనే విజయకాంత్ ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు ఆరోగ్య పరంగా సమస్యలు తలెత్తడంతో హుటాహుటిన నగరంలోని ఓ ఆస్పత్రికి ఆదివారం తరలించారు. ఆయనకు ఆస్పత్రిలో పరిశోధనలు, చికిత్సలు కొనసాగుతున్నాయి. విజయకాంత్ ఆస్పత్రిలో చేరిన సమాచారంతో డీఎండీకే వర్గాలలో ఆందోళన నెలకొంది.
అదే సమయంలో వదంతులు, ప్రచారాలు ఊపందుకున్నాయి. ఇందుకు ముగింపు పలికే విధంగా డీఎండీకే కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. విజయకాంత్‌కు సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ప్రస్తుతం ఆస్పత్రిలో చేర్పించినట్టు వివరించారు. ఆయన రెండు రోజులలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేడర్‌కు భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment