
నటి అభినయ
సాక్షి, బెంగళూరు: అన్న భార్యపై వరకట్న వేధింపులకు పాల్పడిన కేసులో సినీ నటి అభినయకు హైకోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించింది. అనుభవ సినిమా ద్వారా ఆమె పేరుపొందారు. వివరాలు.. 1998లో సోదరుడు శ్రీనివాస్‌కు లక్ష్మీదేవి అనే యువతితో పెళ్లయింది. ఆ సమయంలో కట్నం తీసుకోలేదు. తరువాత కట్నం తేవాలని పదేపదే లక్ష్మీదేవిని వేధించారు.
లక్ష రూపాయలు డిమాండ్ చేయగా ఆమె రూ. 80 వేలు ఇచ్చింది. అయినప్పటికీ వేధింపులను ఆపలేదు. దీంతో బాధితురాలు 2002లో భర్త, అత్తమామలు సహా అభినయపై బెంగళూరు చంద్ర లేఔట్ పీఎస్‌లో కేసు పెట్టింది. ఈ కేసులో హైకోర్టులో విచారణ సాగుతూ వచ్చింది. మంగళవారం కేసును విచారించిన హైకోర్టు జడ్జి జస్టిస్ హెచ్‌బీ ప్రభాకర్‌శాస్త్రి నేరం రుజువైనట్లు పేర్కొన్నారు.
ఎన్నో మలుపులు
ఈ కేసు గతంలో ఎన్నో మలుపులు తిరిగింది. 2012లో కింది కోర్టు కూడా ఈ కేసులో ఐదు మందికి రెండేళ్ల శిక్ష విధించగా, జిల్లా కోర్టు వారి తప్పిదం లేదని శిక్షను రద్దు చేసింది. దీనిని బాధితురాలి కుటుంబం హైకోర్టులో సవాల్ చేయగా విచారణ సాగింది. భర్త శ్రీనివాస్, అత్తమామలు రామకృష్ణ, జయమ్మకు ఐదేళ్లు జైలు శిక్ష, నాలుగో నిందితుడు చలువరాజ్, ఐదో నిందితురాలు అభినయకు రెండేళ్ల శిక్షను విధించారు.
చదవండి: (1920 నేపథ్యంలో...)