
Actress Aishwarya: గతంలో హీరోయిన్‌గా తర్వాత సహాయకపాత్రల్లో నటిగా కనిపించి అలరించింది ఐశ్వర్య. నటనలో తల్లి(సీనియర్ నటి లక్ష్మి)కి తగ్గ కూతురిగా ప్రశంసలు దక్కించుకుంది. జగపతిబాబు హీరోగా నటించిన 'అడవిలో అభిమన్యుడు' సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య అన్ని భాషల్లో కలిపి 50కి పైగా సినిమాలు చేసింది. సినిమాలతో పాటు సీరియల్స్ కూడా చేస్తూ బుల్లితెర ప్రేక్షకులకూ చేరువైంది. తాజాగా ఓ టీవీ షోకు హాజరైన ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సంఘటనలను వెల్లడించింది. ఓ సినిమా షూటింగ్ విరామ సమయంలో పెళ్లి జరిగిందన్న ఐశ్వర్య తమ దాంపత్య జీవితం ఎంతోకాలం సజావుగా సాగలేదని తెలిపింది. తన భర్త మరో పెళ్లి చేసుకున్నాడని తమకు విడాకులు కూడా మంజూరయ్యాయని పేర్కొంది.
కెరీర్ గురించి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఒక దర్శకుడిని కొట్టాలనిపించిందని చెప్పుకొచ్చింది. తన సహనాన్ని పరీక్షించిన అతడు కోటి రూపాయలు ఇచ్చినా ఆయన సినిమాలో మాత్రం నటించనని తేల్చి చెప్పింది. కానీ తర్వాత ఓసారి అతడు తారసపడినప్పుడు మాత్రం అన్నీ మర్చిపోయి గౌరవవంగా మాట్లాడితే ఆ డైరెక్టర్ మాత్రం తన గురించి ఇతరులతో చాలా చెత్తగా మాట్లాడాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు అప్పుడే కొట్టి ఉంటే బాగుండేదని అభిప్రాయపడింది. తనను అంతలా ఇబ్బంది పెట్టిన ఆ దర్శకుడి పేరు మాత్రం వెల్లడించలేదు.
తను సినిమాల్లోకి రావడాన్ని చాలామంది ఇష్టపడలేదని చెప్పుకొచ్చింది. సినిమా వైపు కాదు కదా, అద్దంలో కూడా చూసుకోవద్దని, చూస్తే అద్దం పగిలిపోతుందని తన బంధువులే హేళన చేశారంది. సినిమాల్లోకి వచ్చి అమ్మ పేరు చెడగొట్టొద్దని హెచ్చరించారని తెలిపింది. లక్ష్మి గారికి ఇంత అసహ్యమైన కూతురు పుట్టిందా? అని కామెంట్లు కూడా చేశారని, కానీ అనుకోకుండా ఈ ఇండస్ట్రీలోకి రావాల్సి వచ్చిందని తెలిపింది. మొదట్లో ఆ కామెంట్లు బాధనిపించినా తర్వాత వాటిని పట్టించుకోవడం మానేశానంది.
Comments
Please login to add a commentAdd a comment