
‘రెబల్’ స్టార్ కృష్ణం రాజు మృతిపై సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు జయప్రద భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించిన ఆమె అనంతరం మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతరమయ్యారు. ఆయన మనతో లేరు అనేది తాను నమ్మలేకపోతున్నానని అన్నారు. ‘ఎప్పుడు కనిపించిన జయప్రద ఎలా ఉన్నావంటూ చాలా అప్యాయంగా పలకరించేవారు. ఆయన పిలుపు ఇప్పటికీ నా చేవుల్లో మారుమ్రోగుతుంది. ఎన్నో అద్భుతమైన సినిమాలు, పాత్రలు చేసి ప్రజల హృదయాల్లో ఆయన నిలిచిపోయారు. ఆయన అనారోగ్యంతో తరచూ ఆస్పత్రికి వెళుతు వస్తున్నారని తెలుసు, ఎప్పటిలాగే ఈసారి కూడా ఆస్పత్రికి నుంచి ఆయన తిరిగి వస్తారనుకున్నాం’ అంటూ ఆమె వెక్కెక్కి ఏడ్చారు.
చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రజనీకాంత్ కూతురు
అలాగే ఆమె మాట్లాడుతూ.. ‘ఆయనతో కలిసి నటించే అద్భుతమైన అవకాశాన్ని నాకు ఆ భగవంతుడు కల్పించాడు. తాండ్ర పాపరాయుడు, భక్త కన్నప్ప వంటి ఎన్నో చిత్రాలు చేసి ఈ రోజు రెబల్ స్టార్‌గా నిలిచారు. ఆయన కూతుళ్లు ఇంకా చిన్నపల్లలు. వారికి, ఆయన సతిమణికి ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నా. ఆయన నటుడిగా, రాజకీయ వేత్తగా, కేంద్రమంత్రి ఆయన ఎదిగిన ఎత్తులు సాధారణమైనవి కాదు. ఎలాంటి మచ్చ లేకుండా ఆయన రారాజుగా వెళ్లిపోయారు’ అంటూ జయప్రద భావోద్వేగానికి లోనయ్యారు. కాగా ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన కృష్ణంరాజు ఆదివారం(సెప్టెంబర్ 11న) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
చదవండి: చిరుతో ‘విక్టరి’ వెంకటేశ్ సరదా సన్నివేశం? ఏ సినిమాలో అంటే..!