ఒక్క చాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ సినిమా అవకాశాల కోసం కాళ్లు అరిగేలా తిరిగిన నటీనటులు కష్టపడి అవకాశాలు పొందుతారు. తరువాత ఒక్క హిట్ ఒకే ఒక్క హిట్ కోసం పరితపిస్తారు. అలా ఒక్క సక్సెస్ వస్తే చాలు దాన్ని పట్టుకుని పరుగులు తీస్తుంటారు. ఆ ఒక్క సక్సెస్ వారికి పెద్ద గుర్తింపుగా మారిపోతుంది. ఈ తరువాత ఫ్లాప్స్ వచ్చినా వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. హిట్ చిత్రం గురించే చెప్పుకుంటారు. అలా తెలుగులో సమంతకు ఏమాయ చేసావే చిత్రం కెరీర్‌లో పెద్ద హిట్‌గా నిలిచింది. అదేవిధంగా మలయాళంలో ప్రేమమ్ చిత్రం సాయిపల్లవికి చిరునామాగా మారింది. ఇలా చాలామందికి తొలి చిత్రం హిట్ పెద్ద ప్లస్‌గా మారుతుంది. దాంతోనే చాలా వరకు కాలాన్ని లాగించేస్తారు.
తాజాగా మమితా బైజూ పరిస్థితి అంతే. ఈమె మలయాళంలో నటించిన ప్రేమలు చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. అంతే కాకుండా మమితా బైజూకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. అంతే ఆ తరువాత ఇతర భాషల్లోనూ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అలా ఈమె తమిళంలో నటుడు, సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు జంటగా రెబల్ అనే ద్వారా పరిచయమైంది. ఆ చిత్రం నిరాశపరిచినా, ఈ అమ్మడికి మరిన్ని అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న ఆయన చివరి చిత్రంలో నటించే అవకాశాన్ని మమితా బైజూ కొట్టేసింది. ఇప్పుడు ఆ చిత్రంలో విజయ్‌తో దిగిన ఫొటోలను వాడుకుంటోంది. ఆ ఫొటోలిప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
అంతేకాదు ఈ కేరళ కుట్టి మరో తమిళ చిత్ర అవకాశాన్ని దక్కించుకుందన్నది తాజా సమాచారం. యువ క్రేజీ దర్శక, నటుడు ప్రదీప్ రంగనాథన్‌తో జతకట్టే చాన్స్‌ను కొట్టేసిందని తెలుస్తోంది. కోమాలి చిత్రంతో దర్శకుడిగా పరిచయమై మంచి విజయాన్ని అందుకున్న ఈయన ఈ తరువాత లవ్‌టుడే చిత్రంతో కథానాయకుడిగానూ, దర్శకుడిగానూ సూపర్‌హిట్ కొట్టారు. ప్రస్తుతం విఘ్నేశ్‌శివన్ దర్శకత్వంలో ఎల్‌ఐకే చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. దీంతో పాటు డ్రాగన్ అనే మరో చిత్రం చేస్తున్నారు. తాజాగా ఈయన నటించనున్న చిత్రంలో మమితా బైజూ నాయకిగా నటించనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment