‘‘నిర్మాతగా ‘స్కైలాబ్’ నా తొలి చిత్రం. డబ్బులు సంపాదించడానికి నిర్మాతను కాలేదు. మంచి కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో నిర్మాతగా మారాను. ‘స్కైలాబ్’ సినిమా ఆరంభం నుంచే నేను నిర్మాత కాదు. ఈ సినిమాను ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నంలో భాగంగానే నిర్మాతగా నా ప్రయాణాన్ని మొదలు పెట్టాను’’ అని నిత్యా మీనన్ అన్నారు. నిత్యా మీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన తారాగణంగా డా. రవికిరణ్ సమర్పణలో బైట్ ప్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ పతాకాలపై విశ్వక్ ఖంతడేరాజు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు నిర్మించిన చిత్రం ‘స్కైలాబ్’. ఈ చిత్రం డిసెంబరు 4న థియేటర్స్‌లో విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఈ చిత్రకథానాయిక, నిర్మాత నిత్యా మీనన్ మాట్లాడుతూ – ‘‘స్కైలాబ్ గురించి దర్శకుడు విశ్వక్ చెప్పినప్పుడు కొత్తగా అనిపించింది. స్కైలాబ్ గురించి మా తల్లిదండ్రులతో చర్చించగా, అప్పట్లో స్కైలాబ్ గురించిన భిన్నమైన కథనాలను చెప్పారు. స్కైలాబ్ భూమి మీద పడిపోతే చనిపోతామనే భ్రమలో చాలామంది తాము కూడబెట్టుకున్న ఆస్తులను ఖర్చు చేసేశారట. మరికొందరైతే బంగారు నాణేలు మింగేశారని చెబితే ఆశ్చర్యంగా అనిపించింది. ఇలాంటి అంశాలు నేనీ సినిమా చేసేందుకు దోహదం చేశాయి. బండిలింగంపల్లిలో ఉన్న ముగ్గురు వ్యక్తుల కథే ఈ చిత్రం. ఇందులో నేను జర్నలిస్టు గౌరి పాత్రలో కనిపిస్తాను. సత్యదేవ్, రాహుల్ రామకృష్ణలతో నాకు పెద్దగా కాంబినేషన్ సీన్స్ లేవు. అయితే గౌరి పాత్రను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. తెలంగాణ యాసలో మాట్లాడాను. అది చాలా బాగా అనిపించింది. ఈ సినిమాకు ఓటీటీ ఆఫర్స్ వచ్చాయి. కానీ ఇది థియేట్రికల్ సినిమా’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘ఇతర భాషల్లో సినిమాలు చేస్తున్నందు వల్లే తెలుగులో సినిమాలు చేయలేకపోయాను. ఆరేళ్లుగా పని చేస్తూనే ఉన్నాను. లాక్‌డౌన్లో కాస్త బ్రేక్ దొరికింది. ప్రస్తుతం తమిళంలో ధనుశ్‌తో, మలయాళంలో 19(1)ఎ చిత్రాలతో పాటు హిందీలో ‘బ్రీత్ 3’ వెబ్ సిరీస్ చేస్తున్నాను. నిర్మాతగా వినూత్న సినిమాలు చేయాలనుకుంటున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment