ఈ బతుకే వ్యర్థం అని చావుకు సిద్ధపడిన తనను కుటుంబమే రక్షించిందంటోంది బాలీవుడ్ నటి షామా సికిందర్. వాళ్లే గనక లేకపోయుంటే ఈ భూమిపై తనకు ఎప్పుడో నూకలు చెల్లేని ఆనాటి సంఘటనలను గుర్తు చేసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటి షామా సికిందర్ తన చీకటి రోజుల గురించి మాట్లాడింది.
నానమ్మ నుంచి నాకు..
'15 ఏళ్ల క్రితం నేను అత్యంత దారుణ పరిస్థితిలో ఉన్నాను. తీవ్రమైన ఒత్తిడి దానికి తోడు బైపోలార్ డిజార్డర్(ఇది ఒకరకమైన మానసిక అనారోగ్యం.. ఈ వ్యాధి బారినపడినవారు ఎక్కువ ఎగ్జయిట్ అవుతారు, అధికంగా కుంగిపోతారు). మా నానమ్మకు కూడా ఇదే వ్యాధి ఉండేది. జన్యుపరంగా అది నాకు సంక్రమించింది.
ఈ బతుకే వద్దనుకున్నా
అయితే మా నానమ్మ చేష్టలు చూసి చాలామంది తనకేదో దెయ్యం పట్టిందనుకునేవారు. కొన్నిసార్లు నేనూ తనలాగే ప్రవర్తించేదాన్ని. ఈ జనరేషన్‌లో పుట్టినదాన్ని కనుక నాకేదో చేతబడి జరిగిందని అనుకోలేదు. అయితే ఒకసారి మాత్రం చనిపోయేందుకు ప్రయత్నించాను. నాకు ఈ జన్మ వద్దు, నేను పోయాక నాకు మళ్లీ మరో జన్మ ప్రసాదించమని దేవుడిని వేడుకున్నాను.
నిద్ర మాత్రలు మింగా
బోలెడన్ని నిద్రమాత్రలు మింగాను. నా బ్యాంక్ వివరాలు సోదరుడికి పంపించాను. అప్పుడతడు పెళ్లిలో ఉన్నాడు. నేను సడన్‌గా బ్యాంక్ వివరాలు పంపడంతో ఆందోళన పడ్డ అతడు అమ్మకు ఫోన్ చేశాడు. దీంతో అమ్మ నా గదిలోకి వచ్చి నన్ను నిద్ర లేపేందుకు ప్రయత్నించింది. కానీ నేను లేవలేదు. క్షణాల్లో అందరూ నా చుట్టూ గుమిగూడారు.
మూడేళ్లు గది దాటి బయటకు రాలేదు
వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నా శరీరంలో ఉన్న విషాన్ని తీసేసి బతికించారు. తర్వాత రెండుమూడేళ్లు నాకెంతో కష్టంగా గడిచాయి. గది దాటి బయటకు రాలేదు. నా రూమ్‌లోనే ఒంటరిగా కూర్చుని ఏడ్చేదాన్ని. చాలాకాలానికి నేను తప్పు దారిలో వెళ్తున్నానని అర్థం చేసుకుని దాన్నుంచి నెమ్మదిగా బయటకు వచ్చేశాను' అని చెప్పుకొచ్చింది.
కెరీర్
షామా సికిందర్ ‘యే మేరి లేఫ్ హై’, 'బల్‌వీర్', ‘మన్ మే హై విశ్వాస్’ వంటి సీరియల్స్‌తో నటిగా మంచి గుర్తింపు పొందింది. ప్రేమ్ అగ్గన్ (1998) మూవీతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన ఆమె మన్, యే మొహబ్బత్ హహై, అన్ష్: డెడ్లీ పార్ట్, బస్తీ, ధూమ్ ధడక్కా చిత్రాల్లో నటించింది. చివరిగా 2019లో ‘బైపాస్ రోడ్’లో యాక్ట్ చేసింది.
గమనిక: ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment