‘‘ఆల్ ఇండియా పర్సన్ మేజర్ సందీప్‌గారి బయోపిక్ చేశాను కాబట్టి నా కెరీర్ కూడా ఆ స్థాయికి వెళ్లిందని భావిస్తున్నాను. సందీప్‌గారు కేరళలో పుట్టి, బెంగళూరులో పెరిగారు. హైదరాబాద్ కంటోన్మెంట్‌లో కెప్టెన్.. కార్గిల్, కశ్మీర్‌లో పోరాడారు. హర్యానాలో ట్రైనింగ్ ఆఫీసర్.. ముంబైలో వందల మందిని కాపాడారు. అందుకే ‘మేజర్’ ఆల్ ఇండియా సినిమా’’ అన్నారు అడివి శేష్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మేజర్’. సందీప్‌గా అడివి శేష్ నటించారు. మహేశ్‌బాబు జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్, ఎ ఫ్లస్ ఎస్ మూవీస్‌లతో కలిసి సోనీ పిక్చర్స్ ఫిలింస్ ఇండియా నిర్మించింది. శశికిరణ్ తిక్క దర్శకుడు. జూన్ 3న ఈ చిత్రం రిలీజ్ కానున్న సందర్భంగా అడివి శేష్ చెప్పిన విశేషాలు.
ముంబైలో 26/11 దాడులు జరిగాయి. ఆ తర్వాతి రోజు 27న సందీప్‌గారి ఫోటో టీవీలో కనిపించింది. ఎవరీయన? మా కజిన్ పవన్ అన్నయ్యలా ఉన్నారే అనుకున్నాను. ఆ తర్వాత సందీప్‌గారి గురించి తెలుసుకోవడం ప్రారంభించాను. ఈ క్రమంలో ఆయనకు అభిమానిగా మారిపోయాను. యాక్టర్‌గా నాకంటూ ఓ గుర్తింపు వచ్చిన తర్వాత సందీప్‌గారి జీవితం గురించి నేను ఎందుకు చెప్పకూడదనే ఫీలింగ్ నాలో మొదలైంది. ‘క్షణం’ టైమ్‌లో బాగా ఆలోచించాను. ‘గూఢచారి’ టైమ్‌లో వేడి వచ్చింది. ‘ఎవరు’ సినిమా అప్పుడు సందీప్‌గారి బయోపిక్ చేయాలని నిర్ణయించుకున్నాను. మనకు గాంధీ, భగత్ సింగ్‌గార్ల గురించి తెలుసు. ఇప్పుడు సందీప్‌గారి జీవితం గురించి పాఠ్యాంశాల్లో కూడా బోధిస్తున్నారు.
అదే మాకు సవాల్
సందీప్‌గారి జీవితాన్ని ఓ బయోపిక్‌గా రెండున్నర గంటల్లో చెప్పడం కష్టమే. అయితే కశ్మీర్, కార్గిల్ యుద్ధం, ముంబై తాజ్ ఇన్సిడెంట్, ఆయన బెంగళూరు స్కూల్ డేస్.. ఇలాంటి అన్ని ముఖ్యమైన సీన్స్ సినిమాలో ఉంటాయి. ఓ సందర్భంలో తన స్నేహితుడికి తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసి రెండు రోజుల పాటు సందీప్‌గారు ఏమీ తినకుండా ఉండిపోయారు. ఇలాంటి సినిమాటిక్ అంశాలు ఆయన జీవితంలో ఉన్నాయి. ఇంకా సందీప్‌గారి లైఫ్‌లో మ్యాజికల్ మూమెంట్స్ ఉన్నాయి.
సందీప్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు
బాలీవుడ్, మాలీవుడ్ ఫిల్మ్‌మేకర్స్ సందీప్ బయోపిక్ తీయడానికి ప్రయత్నించారు. అయితే ఫలానా హీరోలు మా కొడుకులా లేరు అని సందీప్‌గారి తల్లిదండ్రులు ఒప్పుకోలేదట. మేం అప్రోచ్ అయినప్పుడు నాలోని నిజాయితీ, వారి కొడుకు పోలికలకు దగ్గరగా నావి ఉండటంతో ఒప్పుకున్నారు. ‘మేజర్’ సినిమాకు ఓ ఇంటర్‌నేషనల్ లుక్ ఇచ్చి నా కెరీర్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకుని వెళ్లాడు డైరెక్టర్ శశి. శ్రీచరణ్ పాకాల ఇంటర్‌నేషనల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ప్రస్తుతం ‘హిట్ 2’, ‘గూఢచారి’ సినిమాలు చేస్తున్నాను.
అంతా మహేశ్‌గారి సపోర్ట్ వల్లే..
మేం ముందడుగు వేయాలనుకున్న ప్రతిసారీ మహేశ్‌బాబుగారు మమ్మల్ని ప్రోత్సహించారు. ఇప్పుడు దర్జాగా దేశవ్యాప్తంగా ప్రీమియర్స్ వేస్తున్నాం. ఆడియన్స్‌కు సినిమా చూపించి, ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం మనం ఎక్కడా చూడలేదు. ఇది మహేశ్‌గారి సపోర్టే వల్లే. ప్రొడక్షన్ పరంగా నమ్రతగారు కూడా హెల్ప్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment