సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ యంగ్‌హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కీలక రిపోర్టును సమర్పించింది. సుశాంత్ అనుమానాస్పద మృతిని సుదీర్ఘం పరిశీలించిన ఎయిమ్స్ వైద్యులు మంగళవారం తుది నివేదికను ప్రభుత్వానికి అప్పగించారు. సుశాంత్ మృతదేహంలో ఎలాంటి విషం లేదని స్పష్టం చేశారు. ఆయన మృతికి ఉరి వేసుకోవడమే కారణమని ఎయిమ్స్ వర్గాలు ధృవీకరించాయి. సుశాంత్ డీఎన్‌ఏను పూర్తిగా పరిశీలించిన తర్వాతే నివేదికను సమర్పిస్తున్నామని, దీనిలో ఎలాంటి సందేహాలు అవసరంలేదని పేర్కొన్నారు. గతంలో మహారాష్ట్ర వైద్యుల నివేదికలో తేలిన విషయాలే తమ పరిశీలనలో తేలాయని వివరించారు. తాజా నివేదిక ఆధారంగా మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. (నలుగురిదీ ఒక్కటే మాట..)
జూన్ 14న ముంబైలోని తన నివాసంలో సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే సుశాంత్ మృతిపై తొలుత అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. తన కుమారుడిని ఎవరో గొంతునులిమి హత్య చేసిఉంటారని, ఇది ముమ్మాటికి హత్యేనని అతని తండ్రి బిహార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనేక వివాదాలు, ఆరోపణల నడుమ సుశాంత్ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలోనే ఎయిమ్స్ తన రిపోర్టును సమర్పించింది. సుశాంత్‌కు ముమ్మాటికి ఆత్మహత్యేనని తేల్చింది. మరోవైపు అతని మరణాంతరం వెలుగుచూసిన డ్రగ్స్ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో తొలినుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి ఇచ్చిన వాంగ్మూలం మేరకు నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) విచారణ జరుపుతోంది. మరోవైపు సీబీఐ సైతం ఎంక్వైరీ చేస్తోంది. (సుశాంత్ మృతి: మర్డర్ కేసుగా మార్చండి!)
మరోవైపు గొంతు నులమడం వల్లనే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయాడని సుశాంత్ ఫ్యామిలీ లాయర్ వికాస్ సింగ్ ఆరోపిస్తున్నారు. తాను పంపిన సుశాంత్ మృతదేహం ఫొటోలు చూసి ఎయిమ్స్ సీనియర్ డాక్టర్ ఒకరు ఈ విషయం స్పష్టం చేశారని పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తులో సీబీఐ చేస్తున్న జాప్యం దారుణమన్నారు. సుశాంత్ అనుమానాస్పద మృతిపై దర్యాప్తును పక్కనబెట్టి, ఎన్సీబీ డ్రగ్స్ కేసుపై ఎక్కువ దృష్టి పెడుతున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment