హీరో ధనుష్‌ను ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ చేసిన పాట 'వై దిస్ కొలైవెరి..'. ధనుష్ రాసిన ఈ పాటకు అనిరుధ్ బాణీలు కట్టారు. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకురాలిగా పరిచయం అయిన '3' చిత్రంలోనే పాటే ఇది! 2012లో విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్న సామెత మాదిరి ఈ మూవీలో వై దిస్ కొలైవెరిడీ పాట విపరీతంగా పాపులర్ అయ్యింది. ఎంతగా అంటే స్వయంగా దేశ ప్రధాని అప్పట్లో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌ను విందుకు ఆహ్వానించి అభినందించారు.
సినిమాను చంపేసింది
ఆ సమయంలో ఏ వీధిలో చూసినా వై దిస్ కొలైవెరి పాటే వినిపించేది. అయితే ఈ పాట 3 చిత్రాన్ని చంపేసిందని ఆ సినిమా దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆమె డైరెక్ట్ చేసిన కొత్త మూవీ లాల్ సలామ్. రజనీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్, జీవితా రాజశేఖర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మించింది. ఏఆర్.రెహ్మన్ సంగీతాన్ని అందించిన ఈ మూవీ శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ తన తొలి చిత్రం 3 గురించి ప్రస్తావించారు.
పాట వల్లే సినిమా మరుగునడపింది
జీవితంలో కొన్ని అనూహ్య సంఘటనలు జరగాలని ఉంటే వాటికి మనం సిద్ధపడాలన్నారు. తన జీవితంలో 3 చిత్రం విషయంలోనూ అలాగే జరిగిందన్నారు. అందులోని వై దిస్ కొలైవెరి సాంగ్ అనూహ్య విజయాన్ని సాధించిందన్నారు. అయితే అది చిత్రానికి బలం కావాల్సింది బలహీనంగా మారిందన్నారు. ఇంకా చెప్పాలంటే ఆ పాట చిత్రాన్ని చంపేసిందన్నారు. ఇటీవల రీ రిలీజ్ అయినప్పుడు పలువురు తనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారన్నారు. చిత్ర నిర్మాణ సమయంలో గానీ, మొదటగా విడుదల అయినప్పుడు రాని అభినందనలు ఇప్పుడు రావడానికి కారణం వై దిస్ కొలైవెరి పాట చిత్రాన్ని మరుగున పడేయడమేనని ఐశ్వర్య పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment