టైటిల్: అలా నిన్ను చేరి
నటీనటులు: దినేష్ తేజ్, హెబా పటేల్, పాయల్ రాధాకృష్ణ, ఝాన్సీ, చమ్మక్ చంద్ర, శత్రు తదితరులు
నిర్మాత: కొమ్మాలపాటి సాయి సుధాకర్
దర్శకత్వం: మారేష్ శివన్
సంగీతం: సుభాష్ ఆనంద్
సినిమాటోగ్రఫి: అండ్రూ
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
విడుదల తేది: నవంబర్ 10, 2023
కథేంటంటే..
వైజాగ్‌లోని వెంకటాపురం గ్రామానికి చెందిన యువకుడు గణేష్(దినేష్ తేజ్)కు సినిమాలు అంటే పిచ్చి. ఎప్పటికైనా దర్శకుడు కావాలని కలలు కంటుంటాడు. ఆ దిశగా ప్రయత్నిస్తున్న సమయంలోనే తన గ్రామానికి చెందిన దివ్య(పాయల్ రాధాకృష్ణ)తో ప్రేమలో పడతాడు. ఈ విషయం దివ్య తల్లి కనకం(ఝాన్సీ) దృష్టికి రావడంతో.. కూతుర్ని తన బంధువువైన కాళీ(శత్రు)కు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది. దివ్య పెళ్లి విషయం తెలిసినా.. గణేశ్ అడ్డుకునే ప్రయత్నం చేయడు. తన లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం హైదరాబాద్‌కు వెళ్తాడు. సినిమా తీయాలన్న గణేష్ లక్ష్యం నెరవేరిందా? కాళీతో దివ్య పెళ్లి జరిగిందా? లేదా? ప్రేమించిన అమ్మాయి పెళ్లి జరుగుతున్నా..గణేష్ ఎందుకు ఆపలేకపోయాడు? హైదరాబాద్‌లో గణేష్ పడిన కష్టాలేంటి? అతని జీవితంలోకి అను(హైబ్బా పటేల్)ఎలా వచ్చింది? అను పరిచయంతో గణేశ్ జీవితం ఎలా మారింది? తను ప్రేమించిన అమ్మాయి దివ్య..తనను ఇష్టపడిన అమ్మాయి అను..ఇద్దరిలో ఎవరిని గణేష్ తన జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘అలా నిన్ను చేరి’ చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
లక్ష్యం కోసం ప్రేమను త్యాగం చేసిన ఓ మిడిల్ క్లాస్ యువకుడి కథే ‘అలా నిన్ను చేరి’. నేటితరం నచ్చే, మెచ్చే అంశాలతో ఫుల్ కమర్షియల్ ఫార్మాట్‌లో దర్శకుడు మారేష్ శివన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే రొటీన్ సన్నివేశాలు, స్క్రీన్‌ప్లే కారణంగా స్టోరీ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌ని చక్కగా డీల్ చేసిన దర్శకుడు.. సెకండాఫ్‌లో కాస్త తడబడ్డాడు. కానీ సాహిత్యం విషయంలో, నటీనటులను నుంచి తనకు కావాల్సిన నటనను రాబట్టుకోవడంతో మాత్రం సక్సెస్ అయ్యాడు. దర్శకుడిగా ఇది తొలి సినిమానే అయినప్పటికీ..కథను తీర్చి దిద్దిన విధానం బాగుంది.
కథ ప్రారంభంగా రొటీన్‌గా ఉన్నా.. దివ్య, గణేష్ ప్రేమలో పడిన తర్వాత మాత్రం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. హీరోయిన్ ప్రపోజ్ చేసే విధానం ఆకట్టుకుంటుంది. ఒకవైపు ప్రేమ..మరోవైపు లక్ష్యం రెండింటి మధ్య హీరో పడే సంఘర్షణకు సంబంధించిన సన్నివేశాలను దర్శకుడు చక్కగా రాసుకున్నాడు. పల్లెటూరి ప్రేమ కథ.. మంచి సాహిత్యంతో ఫస్టాఫ్ ఆకట్టుకుంటుంది. అయితే సెకండాఫ్‌లో మాత్రం కథ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. అను, గణేశ్‌ల మధ్య వచ్చే కొన్ని సన్నీవేశాలు సినిమాటిక్‌గా అనిపిస్తాయి. సినిమా చాన్స్‌కోసం హీరో చేసే ప్రయత్నాలకు సంబంధించిన సన్నివేశాలు కూడా రొటీన్‌గా అనిపిస్తాయి. కానీ ఫ్రీ క్లైమాక్స్ నుంచి కథ ఎమోషనల్‌గా సాగుతుంది. సినిమాను ముగించిన తీరు కూడా ఆకట్టుకుంటుంది.
ఎవరెలా చేశారంటే..
మిడిల్ క్లాస్ యువకుడు గణేష్ పాత్రకు దినేష్ తేజ్ న్యాయం చేశాడు. డ్యాన్స్, యాక్షన్స్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా చక్కగా నటించాడు. ఇక దివ్య పాత్రలో పాయల్ రాధాకృష్ణ ఒదిగిపోయింది. ఇది తనకు తొలి చిత్రమే అయినా.. ఆ విషయం తెరపై కనిపించకుండా నటించేసింది. దినేష్, పాయల్‌ల కెమిస్ట్రీ తెరపై చక్కగా పండింది. ఇక అను పాత్రకు హెబ్బా పటేల్ పూర్తి న్యాయం చేసింది. సెండాఫ్ మొత్తం ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది. రంగస్థలం మహేశ్, చమ్మక్ చంద్ర, ఝాన్సీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. సుభాష్ ఆనంద్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం సినిమాకు ప్లస్ అయింది. కోడి బాయే లచ్చమ్మ పాటతో పాటు మిగతా సాంగ్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. అండ్రూ సినిమాటోగ్రఫీ సినిమాను రిచ్‌గా మార్చింది. ఎడిటర్ తన కత్తెర ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లోని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment