అళగి చిత్ర యూనిట్ అంతా కూడా 22 ఏళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు ఒకే వేదికపై కలవడం సంతోషంగా ఉందని నటి దేవయాని పేర్కొన్నారు. 2012లో విడుదలైన క్లాసికల్ లవ్‌స్టోరీ అళగి (ఇది తెలుగులో లేత మనసులుగా రీమేకైంది). నటుడు పార్తీపన్, దేవయాని, నందితాదాస్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని తంగర్‌బచ్చన్ దర్శకత్వంలో ఉదయగీత ఫిలింస్ పతాకంపై ఉదయకుమార్ నిర్మించారు. ఇళయరాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది.
అదే అళగి చిత్రం 22 ఏళ్ల తరువాత శుక్రవారం (మార్చి 29న) రీరిలీజైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం సాయంత్రం సమావేశం నిర్వహించింది. దర్శకుడు తంగర్ బచ్చన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తుడడం, నటి నందితా దాస్ ముంబైలో ఉన్న కారణంగా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. నటుడు పార్తీపన్, దేవయాని, నిర్మాత ఉదయకుమార్, ఇతర నటీనటులు పాల్గొన్నారు.
దేవయాని మాట్లాడుతూ తాను పెళ్లి చేసుకున్న తరువాత నటించడానికి అంగీకరించిన మొదటి చిత్రం అళగి అని చెప్పారు. ఈ చిత్రంలో నటించమని దర్శకుడు తంగర్‌బచ్చన్ అడిగారన్నారు. ఎంత ప్రేమ ఉన్నా.. ఒక భార్య తన భర్తను వేరొకరితో పంచుకోవడానికి అంగీకరించని పాత్ర రూపకల్పన తనకు చాలా నచ్చిందన్నారు. అందుకే ఈ చిత్రంలో నటించడానికి వెంటనే అంగీకరించినట్లు చెప్పారు.
పార్తీపన్ మాట్లాడుతూ దర్శకుడు తంగర్‌బచ్చన్ మంచి కథారచయిత అని పేర్కొన్నారు. ఆయన కాకుండా వేరే ఎవరున్నా ఈ చిత్రం ఇంత విజయం సాధించి ఉండేది కాదన్నారు. షూటింగ్ ప్రారంభమైన రెండు రోజుల్లోనే ఈ చిత్రం తనకు సెట్ కాదనిపిస్తోందని, తాను వైదొలగుతానని నటి నందితాదాస్ తనతో చెప్పారన్నారు. అయితే తాను చిత్రానికి సంబంధించిన సంభాషణలను వివరించి, ఆమె నటించేలా చేశానన్నారు. కాగా అళగి చిత్రానికి సీక్వెల్ చేయడానికి కథను రెడీ చేశానని, అయితే ఆ టైటిల్‌ను తంగర్‌బచ్చన్ తనకు ఇవ్వనన్నారని చెప్పారు. అందుకే ఆయన రాజకీయాల్లో స్థిరపడిపోతే తనకు అళగి 2 చిత్రం చేయడానికి మార్గం సుగమం అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment