![Allu Aravind Warns Against Thandel Movie Piracy](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/allu-aravind.jpg.webp?itok=qZfU1abG)
‘‘పైరసీ చేయడం పెద్ద క్రైమ్. ప్రస్తుతం సైబర్ సెల్స్ బాగా పని చేస్తున్నాయి. మిమ్మల్ని (పైరసీదారులను) పట్టుకోవడం తేలిక. వాట్సప్, టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్‌లకు ఇదే నా హెచ్చరిక... జాగ్రత్తగా ఉండండి. మీరు జైలుకు వెళ్లే అవకాశం ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) హెచ్చరించారు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తండేల్’(Thandel). అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ అయింది. కాగా, ‘తండేల్’ సినిమాను పైరసీ చేసి, ఆన్‌లైన్లో పెట్టారు.
ఈ విషయంపై సోమవారం ప్రెస్‌మీట్‌లో అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్, ఓటీటీ చర్యల వల్ల కొన్నేళ్లుగా సినిమా పైరసీ ఆగింది. కానీ రెండు నెలల నుంచి మళ్లీ పెరిగింది. మొన్న ‘దిల్’ రాజుగారి సినిమాను ఇలానే ఆన్‌లైన్లో విడుదల చేశారు. పైరసీ నియంత్రణకు ఫిల్మ్ ఛాంబర్‌లోని సెల్ రాత్రీ పగలూ పని చేస్తోంది. కానీ కొందరు వాట్సప్ గ్రూపుల్లో లింకులను ఫార్వార్డ్ చేస్తున్నారు. ఇలా చేస్తున్న వాట్సప్, టెలిగ్రామ్ గ్రూప్‌ల అడ్మిన్‌లను గుర్తించి, సైబర్ క్రైమ్ దృష్టికి తీసుకెళ్లాం. వారిని అరెస్ట్ చేయిస్తాం. ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులో సినిమా పైరసీ ప్రింట్‌ను ప్రదర్శించడం డ్రైవర్ అమాయకత్వం. సినిమా సక్సెస్‌ను మేం ఆస్వాదించే క్రమంలో ఈ పైరసీ సమస్య మాకు ప్రతిబంధకం’’ అన్నారు.
‘‘క్రిమినల్ కేసులు నమోదు అయితే వెనక్కి తీసుకోలేము. పైరసీ చేసినవాళ్లకి, దాన్ని డౌన్‌లోడ్ చేసుకున్న వాళ్లకీ కేసులు వర్తిస్తాయి. ‘తండేల్’ సినిమా పైరసీ కాపీ ఓవర్సీస్ నుంచే వచ్చింది. ఇది తమిళ ప్రింట్ నుంచి వచ్చింది. దానికి తెలుగు ఆడియో కలిపారు. పైరసీ కాపీని ప్రదర్శించవద్దని కేబుల్ ఆపరేటర్స్‌ని కూడా హెచ్చరిస్తున్నాం’’ అని బన్నీ వాసు అన్నారు.
ఇదిలా ఉంటే... ఈ సమావేశం నిర్వహించిన కొంత సమయానికి బన్నీ వాసు ‘ఎక్స్’ వేదికగా ఏపీఎస్‌ఆర్‌టీసీ చైర్మన్ కె. నారాయణరావుని ఉద్దేశించి, ‘‘పైరసీని అడ్డుకునేందుకు కఠినమైన చర్యలు తీసుకోవడానికి నిజాయితీగా మీరు చేసిన ప్రయత్నాన్ని, ఈ విషయంపై త్వరితగతిన స్పందించినందుకు, ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.
ప్లీజ్... లీవ్ అజ్ బిహైండ్
‘తండేల్’ ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అరవింద్ మాట్లాడినప్పుడు... ‘గేమ్ ఛేంజర్’ని తక్కువ చేసినట్లుగా ఉందని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ‘‘ఆ రోజు ‘దిల్’ రాజుగారిని ఉద్దేశించి, నేను మాట్లాడిన మాటలకు అర్థం... ఆయన ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు–నష్టాలు–ఇన్‌కమ్‌ట్యాక్స్‌లు.. ఇవన్నీ అనుభవించారని. ఉద్దేశపూర్వకంగా నేను మాట్లాడిన మాటలు కాదు. మెగా అభిమానులు ఫీలై, నన్ను ట్రోల్ చేశారు. ఫీలైన ఆ అభిమానులకు చెబుతున్నాను... నాకు చరణ్ (రామ్‌చరణ్) కొడుకులాంటి వాడు. నాకున్న ఏకైక మేనల్లుడు. అందుకని ఎమోషనల్‌గా చెబుతున్నాను. ప్లీజ్... లీవ్ అజ్ బిహైండ్’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment