
సంధ్య థియేటర్ ఘటనలో(sandhya Theatre) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు పోలీసుల విచారణ పూర్తయింది. చిక్కడపల్లి పీఎస్‌లో దాదాపు మూడు గంటల 50 నిమిషాల పాటు ఆయనను ప్రశ్నించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఇచ్చిన వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేశారు. దీంతో విచారణ పూర్తయిన వెంటనే అల్లు అర్జున్ తన కారులోనే ఇంటికి బయలుదేరారు. ఆయనతో తండ్రి అల్లు అరవింద్ కూడా ఉన్నారు.
బన్నీకి నోటీసులు..
అంతకుముందు రోజే అల్లు అర్జున్‌కు(allu arjun) చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణ హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి, లాయర్‌తో కలిసి పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు.
అసలే జరిగిందంటే..
ఈనెల 5న అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2(Pushpa 2 the rule) చిత్రం విడుదలైంది. అయితే అంతకుముందు రోజే ఈ మూవీకి సంబంధించిన బెనిఫిట్ షోను ప్రదర్శించారు. ఈ షోను వీక్షించేందుకు అల్లు అర్జున్ తన భార్యతో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు వెళ్లారు. అదే సమయంలో అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్‌పై కూడా కేసు నమోదు చేశారు.
