Amaran Review: ‘అమరన్‌’ మూవీ రివ్యూ | 'Amaran' Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Amaran Review: ‘అమరన్‌’ మూవీ రివ్యూ

Published Thu, Oct 31 2024 1:27 PM | Last Updated on Thu, Oct 31 2024 1:38 PM

'Amaran' Movie Review And Rating In Telugu

శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం ‘అమరన్‌’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించారు. శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన “ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్” అనే పుస్తకంలోని “మేజర్ వరదరాజన్” చాప్టర్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌, పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో టాలీవుడ్‌లో కూడా ఈ మూవీపై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్‌ 31) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే...
ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన ఇండియన్‌ ఆర్మీ ఆఫీసర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ బయోపిక్‌ ఇది. ఇందులో ముకుంద్‌ వరదరాజన్‌గా శివకార్తికేయన్‌ నటించగా.. అతని భార్య ఇందు రెబక్క వర్గీస్‌ పాత్రను సాయి పల్లవి పోషించారు.  2014 ఏప్రిల్ 25న మేజర్ ముకుంద్ వరదరాజన్ దక్షిణ కాశ్మీర్‌లోని ఒక గ్రామంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందారు. ఇది మాత్రమే బయటి ప్రపంచానికి తెలుసు. తమిళనాడుకు చెందిన ముకుంద్‌ వరదరాజన్‌ ఇండియన్‌ ఆర్మీలోకి ఎలా వచ్చాడు? కేరళ యువతి ఇందు(సాయి పల్లవి) తో ఎలా పరిచయం ఏర్పడింది? వీరిద్దరి పెళ్లికి ఎదురైన సమస్యలు ఏంటి?  44 రాష్ట్రీయ రైఫిల్స్ చీతా విభాగానికి కమాండర్‌గా ఆయన అందించిన సేవలు ఏంటి? ఉగ్రవాద ముఠా లీడర్లు అల్తాఫ్‌ బాబా, అసిఫ్‌ వాసీలను ఎలా మట్టుపెట్టాడు? దేశ రక్షణ కోసం తన ప్రాణాలను ఎలా పణంగా పెట్టాడు? అనేదే ఈ సినిమా కథ.

ఎలా ఉందంటే..
బయోపిక్‌ మూవీ తీయడం దర్శకుడికి చాలా కష్టమైన పని.  ఉన్నది ఉన్నట్లు చూపిస్తే.. అది డాక్యుమెంటరీ అవుతుంది. లేదా చొరవ తీసుకొని కమర్షియల్‌ హంగులను జోడిస్తే.. మొదటికే మోసం వస్తుంది. కథతో పాటు అందులోని ఆత్మనూ తీసుకుని తెరకెక్కిస్తే.. ఆ చిత్రాలను ప్రేక్షకులను ఆదరిస్తారు. ఈ విషయంలో డైరెక్టర్‌ రాజ్‌కుమార్ పెరియసామి సఫలం అయ్యాడు. 2014లో కశ్మిర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందిన ముకుంద్‌ వరదరాజన్‌ గురించి తెలియని చాలా విషయాలను వెండితెరపై చూపించాడు. దేశ రక్షణ కోసం ఇండియన్‌ ఆర్మీ చేస్తున్న గొప్ప సేవలను మరోసారి అందరికి గుర్తు చేశారు. 

ఉగ్రదాడిలో మేజర్‌ ముకుంద్‌ వీరమరణం పొందారనే విషయం మాత్రమే అందరికి తెలుసు. కానీ ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి? ఇందు రెబక్క వర్గీస్‌తో ప్రేమాయణం.. వారిద్దరి పెళ్లికి వచ్చిన సమస్యలు? ఫ్యామిలీకి దూరంగా ఉంటూ దేశ రక్షణ కోసం ఆర్మీ చేస్తున్న సేవలను ప.. ప్రతీది కళ్లకు కట్టినట్లు చూపించారు. ఫస్టాఫ్‌ అంతా ముకుంద్‌-ఇందుల లవ్‌స్టోరీతో పాటు ఇరు కుటుంబాల నేపథ్యం..ఇండియన్‌ ఆర్మీలో ముకుంద్‌ అంచెలంచెలుగా ఎదిగి మేజర్‌ స్థాయికి ఎలా వచ్చారనేది గొప్పగా చూపించారు. ఇక సెకండాఫ్‌లో ఉగ్రవాదులను మట్టుపెట్టడానికి ముకుంద్‌ చేపట్టిన ఆపరేషన్‌ చుట్టే కథనం సాగుతుంది. అయితే ద్వితియార్థంలో కొన్ని చోట్ల కథనం సాగదీతగా అనిపిస్తుంది. 

25 ఏప్రిల్ 2014న, షోపియాన్ జిల్లాలోని ఖాసిపత్రి గ్రామంలో ఎన్నికల అధికారుల హత్యలలో నిందితుడైన జైష్-ఎ-మహ్మద్ కమాండర్ అల్తాఫ్ వాసీతో పాటు మరికొంతమంది టెర్రరిస్టులను హతం చేయడానికి చేపట్టిన ‘ ఖాసిపత్రి’ ఆపరేషన్‌ను  మేజర్ ముకుంద్ ఎలా విజవంతం చేశారనేది ఆసక్తికరంగా, ఎమోషనల్‌గా చూపించారు.  ఈ సినిమాలో ఎమోషన్‌ బాగా వర్కౌట్‌ అయింది. సాయి పల్లవి, శివకార్తికేయన్‌ మధ్య వచ్చే చాలా సన్నివేశాలు మన మనసుని తడి చేస్తాయి.  మన రక్షణ కోసం ఇండియన్‌ ఆర్మీ చేస్తున్న త్యాగాలను గుర్తు చేసుకుంటూ భారమైన హృదయంతో థియేటర్‌ నుంచి బయటకు వస్తాం. 

ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాకు ప్రధాన బలం శివకార్తికేయన్‌, సాయి పల్లవిల నటనే. మేజర్‌ ముకుంద్‌గా శివకార్తికేయన్‌, ఆయన భార్య ఇందుగా సాయి పల్లవి వారి వారి పాత్రల్లో జీవించేశారు. వీరిద్దరి మధ్య ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయింది.  ఈ సినిమా కోసం శివకార్తికేయన్‌ పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. చీతా టీమ్‌ సభ్యుడు విక్రమ్‌ పాత్రను పోషించిన నటుడితో పాటు ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. 

సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. జీవీ ప్రకాశ్‌ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. కశ్మీర్‌ అందాలను చక్కగా చూపించారు. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. 
-రేటింగ్‌: 3.25/5

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement