బేబి సినిమాలో హీరోయిన్‌ను గాఢంగా ప్రేమిస్తాడు హీరో ఆనంద్ దేవరకొండ. బ్రేకప్ తర్వాత ఆమెను మర్చిపోలేక నరకం అనుభవిస్తాడు. నిజ జీవితంలోనూ అలాంటి నరకం చూశానంటున్నాడీ యంగ్ హీరో. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బ్రేకప్ బాధను బయటపెట్టాడు.
చికాగో వెళ్లాక తనతో జాలీగా ఉండొచ్చనుకున్నా
ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. 'ఇది నా ఫస్ట్ లవ్ స్టోరీ. నేను ప్రేమించిన అమ్మాయి ఉన్నత చదువుల కోసం చికాగో వెళ్లింది. నేను కూడా అమెరికా వెళ్దామని ఎప్పటినుంచో ప్లాన్ చేసుకుంటున్నాను. కాబట్టి చికాగో చుట్టుపక్కలే ఏదైనా ఒక యూనివర్సిటీలో ఉందామనుకున్నాను. అమెరికాలోని టాప్ 5 ఇంజనీరింగ్ కాలేజీకి అప్లై చేస్తే సీటు దొరికింది. షాకయ్యాను. ఇంక చికాగోకు వెళ్లిపోయాక ఇద్దరికీ స్వేచ్ఛ దొరుకుతుంది. కలిసి ఉండొచ్చు, మా ప్రేమకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనుకున్నాను. కానీ అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి! అక్కడికి వెళ్లాక వ్యవహారం బెడిసికొట్టింది.
బ్రేకప్ బాధ..
నా గుండె పగిలినంత పనైంది. ఆ బ్రేకప్ బాధలో నుంచి బయటపడటానికి నాలుగైదేళ్లు పట్టింది. ఎంతో నిజాయితీగా ప్రేమించాను. కానీ వర్కవుట్ కాలేదు. చాలా బాధపడ్డాను' అని చెప్పుకొచ్చాడు. అమెరికాలో చదువుకుని అక్కడ కొంతకాలం ఉద్యోగం కూడా చేశాడు ఆనంద్. ఆ సమయంలో ఏడాదికి రూ.40 లక్షల జీతం తీసుకున్నాడు. కానీ సినిమాల మీద ఆసక్తితో జాబ్ వదిలేసి ఇండియాకు వచ్చాడు. దొరసాని సినిమాతో హీరోగా మారాడు. మిడిల్ క్లాస్ మెలొడీస్, పుష్పక విమానం, హైవే ఇలా భిన్న ప్రాజెక్టులు చేసుకుంటూ పోయాడు. గతేడాది బేబి చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment