ఇది ఐపీఎల్ సీజన్. తెలుగులో ఓ అమ్మాయి చక్కగా మాట్లాడుతోంది. బాడీ లాంగ్వేజ్ ప్రొఫెషనల్‌గా ఉంది. ఏ ముంబై అమ్మాయో అనుకునేటట్లు ఉంది. ఆ అమ్మాయి పేరు 'వింధ్య విశాఖ' మేడపాటి. 20 మంది యాంకర్లను వెనక్కినెట్టి, వ్యాఖ్యాతగా అవకాశం దక్కించుకన్న మొదటి తెలుగమ్మాయిగా వింధ్య రికార్డు సృష్టించింది. స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా మగవాళ్లను మాత్రమే చూసిన తెలుగు తెరకు పరిచయమైన తొలి తెలుగమ్మాయి. ఐపీఎల్ సీజన్-11 నుంచి హోస్ట్‌గా క్రికెట్ అభిమానులను ఆమె ఆకర్షిస్తోంది. తాజాగా తన మోడలింగ్ రోజుల గురించి పలు విషయాలను ఆమె పంచుకుంది.
ఎక్కువగా మగవారు మాత్రమే ఉన్న క్రికెట్ రంగంలో కుటుంబసభ్యుల ప్రోత్సహం వల్లే తాను కెరీర్‌లో రాణించగలుగుతున్నానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వింధ్య తెలిపారు. డిగ్రీ సెకండియర్‌లో ఉన్నప్పుడు న్యూస్ ప్రజెంటర్‌గా, మోడల్‌గా అవకాశాలు ఎక్కువగా వస్తున్నప్పుడు చదువుని నిర్లక్ష్యం చేయకూడదని తన అమ్మగారి షరతు పెట్టడంతో ఎం.ఏ ఇంగ్లీష్ పూర్తి చేసినట్లు ఆమె చెప్పారు. ఆ తర్వాత ఆమె కొంతకాలం పాటు మోడలింగ్‌లోనూ శిక్షణ పొందానని పేర్కొన్నారు.
(ఇదీ చదవండి: 63 ఏళ్ల టాప్ హీరోతో సినిమా.. నో చెప్పిన మీనా)
అలా కాలేజీ రోజుల్లోనే పలు అందాల పోటీల్లో పాల్గొన్న వింధ్య విన్నర్‌గా కూడా రాణించినట్లు తెలిపింది. దీంతో ఎలాగైనా మోడలింగ్ చేయాలనే ఆలోచన రావడంతో చదువు పూర్తి అయన తర్వాత మోడలింగ్‌లో శిక్షణ తీసుకున్నట్లు ఆమె అన్నారు. 'సుమారు కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఒక ఫ్యాషన్ వీక్‌లో నేను పాల్గొన్నాను. అదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ షో గా నా కెరియర్‌లో మిగిలిపోయింది. అక్కడి వాతావరణం చూసిన తర్వాత ఈ రంగం నాకు ఏ మాత్రం సెట్ కాదని అనుకున్నాను. ఆ ఫ్యాషన్ షో కోసం వచ్చిన అమ్మాయిలకు దుస్తులు మార్చుకోవడానికీ సరైన గదులు కూడా లేవు.
బ్యాక్ స్టేజ్ వద్ద అందరి ముందు దుస్తులు మార్చుకోవాల్సి ఉంటుంది. అది చూసి కొంత సమయం పాటు షాకయ్యా. ఆ క్షణంలోనే నిర్ణయం తీసుకున్నా ఈ రంగం నాకు ఏ మాత్రం సెట్ కాదనిపించింది. ఆ ఒక్క షో వల్ల మోడలింగ్‌ను వదిలేశాను. ఇది నాకు ఎదురైన అనుభవాన్ని మాత్రమే చెప్పుతున్నాను. అన్ని చోట్లా ఇలాగే ఉంటుందనేది నా అభిప్రాయం కాదు.'అని వింధ్య తెలిపారు. ఆమెకు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి. గోపాల గోపాల, ముకుందా వంటి చిత్రాల్లో కూడా తనకు అవకాశం వచ్చినట్లు వింధ్య చెప్పారు. కానీ తనకు సినిమా రంగం అంటే పెద్దగా ఆసక్తి లేకపోవడంతో ఆ చిత్రాలకు నో చెప్పినట్లు ఆమె అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment