సాధారణంగా ఏ డైరెక్టర్ అయినా రెండున్నర గంటల సినిమాను దాదాపు 3 గంటలకు పైగా నిడివితో షూట్ చేస్తాడు. ఎంత అనుభవం ఉన్న డైరెక్టర్ సినిమా అయినా సరే ఎడిటింగ్‌లో అరగంట సీన్స్ అయినా ఎగిరిపోతాయి. చాలా తక్కువ మంది మాత్రమే కావాల్సిన నిడివి మేరకు మాత్రం చిత్రీకరణ చేస్తారు. వారిలో పూరీ జగన్నాథ్, ఆర్జీవీ ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడా లిస్ట్‌లోకి అనిల్ రావిపూడి(Anil Ravipudi)ని కూడా ఎక్కించొచ్చు. ఎడిటింగ్‌కి అవకాశం లేకుండా ముందే లెక్కలు వేసుకొని సినిమాను కంప్లీట్ చేస్తున్నాడు. స్టార్ హీరో సినిమా అయినా సరే రెండు, మూడు నెలల కంటె ఎక్కువ సమయం తీసుకోవట్లేదు. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించాడు.
నాలుగైదు నిమిషాలే వృథా
సాధారణంగా స్టార్ హీరోలతో సినిమా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం ఏడాది సమయం అయినా పడుతుంది. రాజమౌళి లాంటి వాళ్లు అయితే మూడు ఏళ్లకు పైనే సమయం తీసుకుంటారు. కానీ అనిల్ రావిపూడి మాత్ర కేలవం 72 రోజుల్లో సినిమాను పూర్తి చేశాడు. అది కూడా స్టార్ హీరో సినిమా. అదే ‘సంక్రాంతికి వస్తున్నాం’((Sankranthiki Vasthunnam Movie). ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ప్రచార కార్యక్రమంలో భాగంగా అనిల్‌రావిపూడి మాట్లాడుతూ.. సినిమా మేకింగ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ సినిమా షూటింగ్‌ని కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేశారట. అంతేకాదు ఐదారు నిమిషాల ఫుటేజ్ మాత్రమే వృథా అయిందట.
‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం అనౌన్స్ చేసినప్పుడే ఈ సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించాం. తక్కువ సమయం షూటింగ్ ముగించుకోవాలనుకున్నాం. స్క్రిప్ట్ సమయంలోనే ఎడిటింగ్ చేసేశాం. ఫలానా సీన్ మూడు నిమిషాలు తీయాలనుకుంటే అంతే తీశాం. అందుకే 72 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. మొత్తం సినిమా దాదాపు 2.26 గంటల నివిడితో పూర్తయితే.. 2.22 గంటల నిడివితో సెన్సార్‌కు పంపాం. కేవలం ఐదారు నిమిషాలు మాత్రమే ఎడిట్ చేయాల్సి వచ్చింది. ఈ మూవీకి ఎంత బడ్జెట్ అవసరమో అంతకు ఏమాత్రం తగ్గకుండా తీశాం. క్వాలిటీ విషయంలోనూ అస్సలు రాజీపడలేదు’ అని అనిల్ రావిపూడి అన్నారు.
సంక్రాంతి బరిలో..
అనిల్ రావిపూడి దర్వకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేశ్(venkatesh) సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ నటించారు. సంక్రాంతికి కానుకగా.. జనవరి 14న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సంక్రాంతి బరిలో మరో రెండు బడా సినిమాలు కూడా విడుదల కానున్నాయి. అందులో ఒకటి రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది. ఇక బాలకృష్ణ-బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ చిత్రం కూడా ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment