ప్రభాస్‌తో ఎప్పటికీ అలానే ఉంటాను: అనుష్క | Anushka Shetty Comments About Her Marriage In Latest Interview - Sakshi
Sakshi News home page

ప్రభాస్‌తో ఎప్పటికీ అలానే ఉంటాను: అనుష్క

Published Wed, Sep 6 2023 12:08 AM | Last Updated on Wed, Sep 6 2023 9:02 AM

Anushka Shetty Comments Her Marriage Latest Interview - Sakshi

ఐదేళ్ల తర్వాత అనుష్క వెండితెరపై కనిపించనున్నారు. ‘ఇక కెరీర్‌లో ఇంత లాంగ్‌ గ్యాప్‌ ఎప్పుడూ తీసుకోను’ అంటున్నారామె. మహేశ్‌బాబు పి. దర్శకత్వంలో అనుష్కా శెట్టి, నవీన్‌ పొలిశెట్టి ముఖ్య తారలుగా యూవీ క్రియేషన్స్‌ పై వంశీ, ప్రమోద్‌ నిర్మించిన చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’. రేపు (సెప్టెంబర్‌ 7) ఈ చిత్రం విడుదల కానుంది. ‘భాగమతి’ (2018) తర్వాత అనుష్క సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించనున్న చిత్రం ఇది. ఇక ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనుష్క చెప్పిన విశేషాలు తెలుసుకుందాం.

  ‘మిస్‌ శెట్టి..’లో చేసిన షెఫ్‌ అన్విత క్యారెక్టర్‌ గురించి...
షెఫ్‌ క్యారెక్టర్‌ చేయడం నాకు ఇదే తొలిసారి. ఇది నా బెస్ట్‌ మూవీలా ఫీలవుతున్నాను. ఎందుకంటే ఐదున్నరేళ్ల థియేట్రికల్‌ రిలీజ్‌ తర్వాత ఒక కొత్త పాత్ర, సరికొత్త కథాంశం ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఈ చిత్రంలో మంచి భావోద్వేగాలు ఉన్నాయి.  

ట్రైలర్‌లో కామెడీ, ఎమోషన్‌ కనిపించాయి. మీరీ సినిమా ఒప్పుకోవడానికి కారణం ఇవేనా?  
నేను కథకి ప్రాధాన్యత ఇస్తాను. నాకు, నిర్మాతలకు  వినయ్‌గారు అని కామన్‌ ఫ్రెండ్‌ ఉన్నారు. మహేశ్‌ వద్ద ఒక స్టోరీ ఉంది వింటారా? అని అడిగారు.. అయితే సినిమా చేయమని కాదు. మహేశ్‌గారు కథ చెప్పాక అన్విత పాత్ర ఎవరు చేస్తున్నారు? అని అడిగాను. ఇంకా ఎవర్నీ అనుకోలేదని తను చెప్పగానే నేను చేస్తానన్నాను. మహేశ్‌ ఓ మంచి కథని కొత్తగా, క్లీన్‌ వేలో చూపించారు.  

క్లీన్‌ వే అన్నారు. ట్రైలర్‌లో ‘తల్లవ్వాలంటే గర్భవతి కావాలి కానీ పెళ్లక్కర్లేదు’ అనే డైలాగ్‌ చెప్పారు.. 
అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందనేది సినిమా చూస్తే అర్థం అవుతుంది. ట్రైలర్‌ అన్నది జస్ట్‌ గ్లింప్స్‌ మాత్రమే. లైఫ్‌లో ఎలా ఉంటాం? మన మైండ్‌ ఎలా మాట్లాడుతుంది? అనేది చెప్పాం. 

మైండ్‌లో ఉన్నదాన్ని బయటకు చెబితే సమాజం ఒప్పుకోదు కదా? 
మన మైండ్‌ చాలా విషయాలు చెబుతుంది. కానీ, వాటిలోని సున్నితత్వాన్ని మనం అర్థం చేసుకొని మాట్లాడాలి. నా ఇష్టం వచ్చినది నేను చెబుతాను.. దాన్ని అర్థం చేసుకోకుంటే మీ సమస్య అనను. మనం ఏం చెప్పాలనుకుంటున్నామో దాన్ని సరైన విధానంలో చెప్పాలి. అంతేకానీ, ఎదుటి వారు హర్ట్‌ అయ్యేలా చెప్పడం సరికాదని నమ్ముతాను. మన మైండ్‌లో ఉన్నదాన్ని చెప్పే పద్ధతిలో చెప్పాలి.

18 ఏళ్ల కెరీర్‌లో నటిగా మీ గ్రాఫ్‌ పెరిగింది. వ్యక్తిగతంగానూ పెద్దంత వివాదాలు లేకుండా సాగిన ఇన్నేళ్ల ప్రయాణాన్ని విశ్లేషించుకుంటే.. 
యాక్చువల్లీ నేను కాంట్రవర్శీలను హ్యాండిల్‌ చేయలేను. ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్‌. ఇలా నాలా సెన్సిటివ్‌గా ఉండేవాళ్లకు వేరేవాళ్ల ఎమోషన్స్‌ అర్థమవుతాయి. దాంతో హర్ట్‌ అయ్యేలా మాట్లాడలేం. నాకు ఇండస్ట్రీ, ప్రేక్షకుల నుంచి బోలెడంత ప్రేమ, గౌరవం దక్కాయి. అందుకే పెద్దగా వివాదాలు కూడా లేవు. 

అరుంధతి, దేవసేన (బాహుబలి), భాగమతి.. ఇలాంటి రేర్‌ క్యారెక్టర్స్‌ దక్కడం మీకో బ్లెస్సింగ్‌ అనొచ్చా.. 
కచ్చితంగా.. మనకి హార్డ్‌వర్క్‌ చేయాలని ఉన్నా రైట్‌ చాన్స్‌ కూడా రావాలంటాను. శ్యామ్‌గారు, కోడి రామకృష్ణగారు నన్ను ‘అరుంధతి’గా విజువలైజ్‌ చేసి, నమ్మి తీసుకున్నారు. దర్శక–నిర్మాతలు నన్ను నమ్మారు కాబట్టి నాకు హార్డ్‌ వర్క్‌ చేయడానికి చాన్స్‌ దొరికింది. నిరూపించుకునే స్కోప్‌ దక్కింది.

ఈ మధ్య మీలో భక్తి భావం ఎక్కువయినట్టుంది.. పూజలు చేస్తున్నారు... ఆలయాలు సందర్శిస్తున్నారు.. 
ఇప్పుడనే కాదు.. నా చిన్నప్పటి నుంచి కూడా మా కుటుంబంలో గుడికి వెళ్లడం ఒక భాగం. ప్రతి సోమవారం, శుక్రవారం పూజలు చేస్తుంటాం. అయితే కంటిన్యూస్‌గా సినిమాలు చేయడంవల్ల ఆ మధ్య గుడికి వెళ్లడానికి కుదరలేదు. ఈ మధ్య వచ్చిన లాంగ్‌ గ్యాప్‌లో వెళ్లడానికి కుదిరింది.   

పెళ్లి కాని అమ్మాయిలు పూజలు చేస్తే.. పెళ్లి కోసమే అనే చర్చ జరుగుతుంటుంది... మీ గురించి కూడా అలాంటి ఒక చర్చ ఉంది.. 
ఇప్పుడనే కాదు.. నేను గుడికి వెళ్లిన ప్రతిసారీ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. ఒక మంచి విషయం ఏంటంటే.. నా కూతురి గురించి అందరూ ఇంత కేర్‌ తీసుకుంటారని మా అమ్మానాన్న ఆనందపడతారు (నవ్వుతూ). 

మరి.. పెళ్లి కబురు ఎప్పుడు చెబుతారు? 
ఇప్పుడు ప్లాన్స్‌ లేవు. పెళ్లనేది మంచి విషయం కాబట్టి కుదిరినప్పుడు హ్యాపీగా షేర్‌ చేసుకుంటా.

మీ కో–స్టార్స్‌కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చినప్పుడు మీకు సంతోషం అనిపించడం సహజం... అలా పాన్‌ ఇండియా స్థాయి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌ గురించి...  
ప్రభాస్‌గారు నాకు 2005 నుంచే తెలుసు. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు ఈ స్థాయి గుర్తింపు వచ్చాక కూడా ప్రభాస్‌గారు అలానే ఉన్నారు. ఏ మార్పూ లేదు. తను నాకు ‘వెరీ వెరీ డియర్‌ ఫ్రెండ్‌’. అది ఎప్పటికీ అలానే ఉంటుంది. అలాగే రాజమౌళిగారి ఫ్యామిలీ కూడా నాకు క్లోజ్‌. భైరవ (కాలభైరవ)ని తన చిన్నప్పట్నుంచి చూస్తున్నాను. తనకు మంచి (‘కొమురం భీముడో..’కి సింగర్‌గా నేషనల్‌ అవార్డు వచ్చిన విషయాన్ని ఉద్దేశించి) గుర్తింపు రావడం హ్యాపీగా ఉంది. మనకు క్లోజ్‌గా ఉన్నవాళ్లు ఎదుగుతుంటే చూడ్డానికి చాలా ఆనందంగా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement