కొత్త సినిమాలు రిలీజవగానే చూసేయాలని చాలామందికి ఉంటుంది. అందుకు సమయం ఒక్కటే ఉంటే సరిపోదు, దానికి సరిపడా డబ్బు కూడా ఉండాలి. థియేటర్లో బోలెడన్ని సినిమాలు రిలీజవుతుంటాయి. వాటన్నింటినీ చూడాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే! పోనీ వారానికో, నెలకోసారైనా సినిమాకు వెళ్తామన్నా మల్టీప్లెక్స్‌లో టికెట్, స్నాక్స్ ఖర్చు అంతా కలిసి వేలల్లో ఉంటోంది. అటు చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడమే గగనమైపోతోంది. దీంతో పేద, మధ్య తరగతి కుటుంబాల కోసం, అటు చిన్న సినిమాలను బతికించడం కోసం అత్యంత తక్కువ ధరకే, ఇంట్లోనే సినిమా చూసే అవకాశాన్ని కల్పించింది ఏపీ ఫైబర్ నెట్.
చిన్న సినిమాలకు చేయూతనివ్వాలనే..
దీని వల్ల కొత్త సినిమా రిలీజైనరోజే కుటుంబసభ్యులతో కలిసి ఇంట్లో ఎంచక్కా చూసేయొచ్చు. అటు చిన్న సినిమాలకు సైతం లాభం చేకూరనుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్(ఏపీఎస్‌ఎఫ్‌ఎల్)లో ఓటు అనే మరో కొత్త సినిమా రిలీజైంది. ఈ సినిమా పోస్టర్‌ను ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'చిన్న సినిమాలకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ఏపీ ఫైబర్ నెట్‌లో ఫస్ట్ డే ఫస్ట్ షో అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఓటు ప్రాధాన్యత తెలిపేందుకు ఏపీ ఫైబర్ నెట్‌లో ఓటు అనే సినిమా రిలీజవుతోంది.
కేవలం రూ.39కే కొత్త సినిమా
ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ మూవీతో కార్తీక్ శౌర్య హీరోగా పరిచయం అవుతున్నారు. కేవలం రూ.39కే ఈ సినిమాను ప్రేక్షకులు వీక్షించవచ్చు. ఇకపోతే రామ్‌గోపాల్ వర్మ తీసిన సినిమాలను ప్రదర్శించేందుకు అగ్రిమెంట్ చేసుకున్నాం. కాగా సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ప్రకారం రాష్ట్రంలోని ప్రతి గ్రామం, చివరి ఇంటి వరకు ఇంటర్‌నెట్ ఇచ్చే దిశగా పనిచేస్తున్నాం. భవిష్యత్తులో ప్రతి ఇంటికి ఉచితంగా ఇంటర్‌నెట్ ఇస్తాం' అని తెలిపారు.
చదవండి: తినడానికి తిండి లేని రోజులు.. కన్నీళ్లు పెట్టుకున్న శోభ తల్లి
Comments
Please login to add a commentAdd a comment