'ఏపీ ప్రభుత్వం ఆలోచన సరైనదే' | AP Government Idea Is Correct Over Movie Tickets: Narayan Das | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రభుత్వం ఆలోచన సరైనదే: నిర్మాత కె. నారాయణ్‌ దాస్‌

Published Sat, Sep 18 2021 12:11 AM | Last Updated on Sat, Sep 18 2021 12:02 PM

AP Government Idea Is Correct Over Movie Tickets: Narayan Das - Sakshi

రామ్మోహన్‌ రావు, నారాయణ్‌ దాస్‌ నారంగ్‌

‘‘అతి తక్కువ ధరకే ప్రేక్షకులకు వినోదం పంచుతున్నది సినిమా మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌లో ఆన్‌లైన్‌లో టిక్కెట్ల అమ్మకం విధానం తీసుకురావాలనే ప్రభుత్వ ఆలోచన సరైనదే. దేశం మొత్తం ఆన్‌లైన్‌ టిక్కెట్‌ విధానం తీసుకురావాలి. అప్పుడే ఎంత వసూళ్లు వస్తున్నాయన్నది నిర్మాతకు తెలుస్తుంది.. ప్రభుత్వానికి కూడా మంచి ఆదాయం వస్తుంది’’ అని నిర్మాత కె. నారాయణ్‌ దాస్‌ నారంగ్‌ అన్నారు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. కె. నారాయణ్‌ దాస్‌ నారంగ్, పి. రామ్మోహన్‌ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో కె. నారాయణ్‌ దాస్‌ నారంగ్‌ మాట్లాడుతూ- ‘‘లాక్‌డౌన్‌లో మా ‘లవ్‌స్టోరీ’ సినిమాకి చాలా ఓటీటీ ఆఫర్స్‌ వచ్చాయి.. అయితే ఇలాంటి సినిమాను థియేటర్లోనే చూడాలని ఇన్ని రోజులు వేచి చూశాం. అన్ని ప్రేమ కథలు ఒక్కటే. అయితే ప్రేక్షకులకు దాన్ని ఎలా చూపించామన్నదే ముఖ్యం. మా ‘లవ్‌స్టోరీ’ సినిమాలో ప్రేమకథతో పాటు ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది’’ అన్నారు. 

పి. రామ్మోహన్‌ రావు మాట్లాడుతూ -‘‘1987లో ఎగ్జిబిటర్‌గా నా కెరీర్‌ మొదలైంది. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్, ఆ తర్వాత నిర్మాతగా మారాను. 15 సినిమాలు నిర్మించాను. వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌లో తొలిసారి ‘లవ్‌స్టోరీ’ సినిమా నిర్మించాం.. మరిన్ని నిర్మిస్తాం. ‘లవ్‌స్టోరీ’ తో శేఖర్‌ కమ్ముల, మాకు మధ్య మంచి బాండింగ్‌ ఏర్పడింది. అందుకే ఆయనతో ధనుష్‌ హీరోగా మరో సినిమా చేస్తున్నాం. ఆ తర్వాత కూడా మరో సినిమా శేఖర్‌తో చేస్తాం. కరోనా వల్లనే  ‘లవ్‌స్టోరీ’ సినిమా విడుదల ఆలస్యమైంది. ఆంధ్రప్రదేశ్‌లో టిక్కెట్ల ధరల విషయంలో ఈ నెల 20న జరిగే సమావేశంలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రాలో థియేటర్లకు రాత్రి 10గంటల వరకే పర్మిషన్‌ ఉంది. ఆ సమయంలోపు రోజుకు నాలుగు ఆటలు వేసేలా ప్రయత్నాలు చేస్తున్నాం.

‘తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌’ చైర్మన్‌గా నేను ఉన్నప్పుడు తెలంగాణలోనూ ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ విక్రయాలు జరిపితే బాగుంటుందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను.. ప్రస్తుతం 80శాతం థియేటర్లు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు విక్రయిస్తున్నాయి. నాగచైతన్యతో మా బాండింగ్‌ చాలా బాగుంది.. అందుకే ఆయనతో మరో సినిమా చేయనున్నాం. మా బ్యానర్స్‌లో  దాదాపు 10 సినిమాలు చేస్తున్నాం. కమల్‌హాసన్‌గారు నారాయణ దాస్‌కి చాలా క్లోజ్‌.. ధనుష్‌ సినిమా చర్చల కోసం చెన్నై వెళ్లినప్పుడు కమల్‌గారిని కూడా కలిశాం. ఇప్పటినుంచి వచ్చే ఏడాది ఆఖరు వరకు మేం 10 సినిమాలు రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం. నాగశౌర్య చిత్రాన్ని నవంబర్‌లో, నాగార్జునగారి చిత్రాన్ని ఫిబ్రవరిలో రిలీజ్‌ చేస్తాం. ఆ తర్వాత సుధీర్‌బాబు, ధనుష్, శివ కార్తికేయన్‌ సినిమాలు చేస్తా’’ అన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement