కొన్ని సినిమాలు క్లాసిక్స్. వీటిని మ్యాచ్ చేయడం సంగతి అటుంచితే.. ఇలాంటివి మళ్లీ తీయడం ఎవరి వల్ల కాదు. ఇప్పుడంటే మన ప్రేక్షకులు 'బాహుబలి', 'కేజీఎఫ్' అని మురిసిపోతున్నారు. కానీ వీటికి బాబులాంటి మూవీ హాలీవుడ్‌లో దాదాపు 20 ఏళ్ల క్రితమే వచ్చింది. అదే 'అపోకలిప్టో' (2006). శతాబ్దాల క్రితం కథతో మొత్తం అడవిలో తీసిన ఈ సినిమా చూస్తుంటే ఒక్కో సీన్ దెబ్బకు మన మైండ్ బ్లాస్ట్ అయిపోవడం గ్యారంటీ. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఎలా ఉందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం!
కథేంటి?
ఉత్తర అమెరికాలోని మెసో అమెరికన్ అడవులు. మాయన్ తెగకు చెందిన జాగ్వర్ పా.. ఓ రోజు వేటకు వెళ్తాడు. దొరికిన మాంసంతో రాత్రి విందు చేసుకుని కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వేడుక చేసుకుంటాడు. మరుసటి రోజు ఉదయం వీళ్లపై వేరే తెగకు చెందిన కొందరు దాడి చేస్తారు. ముందే పసిగట్టిన జాగ్వర్ పా.. తన భార్య, కొడుకుల్ని ఓ బావిలో సురక్షితంగా దాచేస్తాడు. దాడి చేసిన వాళ్లు కొందరిని అతి కృూరంగా చంపేసి జాగ్వర్ పాతో పాటు మిగిలిన ఆడవాళ్లు-మగవాళ్లని బానిసలుగా చేసుకుని తమ రాజ్యంలో బలిచ్చేందుకు తీసుకెళ్తారు. ఇంతకీ జాగ్వర్ పా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌పై దాడి చేసిందెవరు? చివరకు పా తన భార్య-కొడుకుని కలుసుకున్నాడా? అనేదే స్టోరీ.
ఎలా ఉందంటే?
ఉత్తర అమెరికాలో శతాబ్దాల క్రితం అంతరించిపోయిన మాయన్ నాగరికత ఆధారంగా 'అపోకలిప్టో' సినిమా తీశారు. ఇప్పటివరకు వచ్చిన యాక్షన్ మూవీస్‌లో ఇది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. ఎందుకంటే ఎప్పుడో అంతరించిపోయిన మాయన్ తెగ, నాగరికతని స్టోరీగా ఎంచుకోవడమే పెద్ద సాహసం అనుకుంటే.. అసాధారణ రీతిలో తెరపై చూపించిన విధానం అయితే నెక్స్ట్ లెవల్ ఉంటుంది. పేరుకే హాలీవుడ్ సినిమా గానీ ఒక్క ఇంగ్లీష్ పదం కూడా వినిపించదు. పాత్రలన్నీ మాయన్ భాషలోనే మాట్లాడుతుంటాయి.
ప్రధాన పాత్రల భాష, గెటప్, ఆహారపు అలవాట్లు, నిర్మాణాలు, సంస‍్కృతి.. ఇలా ప్రతి విషయాన్ని ఎంతో డీటైల్డ్‌గా పరిశీలించి ఈ సినిమాలో చూపించారు. సినిమా మొదలైన కాసేపటికే ప్రధాన కథానాయకుడు జాగ్వర్ పా ఉంటున్న చోటపై మరో తెగ దాడి చేయడంతో అసలు కథలోకి దర్శకుడు తీసుకెళ్లిపోయాడు. అక్కడి నుంచి ఒక్కో సీన్ అద్భుతం అనేలా ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో హీరో.. విలన్ చోటు నుంచి తప్పించుకుని పరుగెడతాడు. అతడు ఎంత స్పీడుగా రన్నింగ్ చేస్తాడో.. సినిమా కూడా అంతకంటే స్పీడుగా వెళ్తుంది. చూస్తున్న మనకు కూడా ఊపిరి ఆగిపోతుందేమో అనేలా సీన్లు ఉంటాయి.
దర్శకుడు మెల్ గిబ్సన్ తన మాయాజాలంతో తీసిన 'అపోకలిప్టో'.. ఇప్పటి జనరేషన్ డైరెక్టర్లకు ఓ టెక్స్ట్ బుక్ లాంటిది అని చెప్పొచ్చు. మన దగ్గర వస్తున్న 'బాహుబలి', 'కేజీఎఫ్' సినిమాలు.. దీని దరిదాపుల్లోకి కూడా రావు. ఇంతలా హైప్ ఇస్తున్నానంటే మూవీ ఎలా ఉంటుందే మీకే అర్థమైపోతుంది. అప్పటి కథ కాబట్టి మహిళా పాత్రల శరీరం కాస్త కనిపిస్తుంటుంది. కాబట్టి కుదిరితే ఒంటరిగానే చూడండి. ఓటీటీలోనే ఏదైనా మంచి యాక్షన్ మూవీ చూద్దామనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్.
-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment