
ఏ రంగంలోనైనా విజయం ఎంత ప్రభావం చూపుతుందో.. అపజయం కూడా అంతే ప్రభావం చూపుతుంది. దీనికి చిన్న ఉదాహరణే దర్శకుడు ఏఆర్ మురుగదాస్. తొలి చిత్రం నుంచి సర్కార్ వరకు వరుసగా ఒకదానికి మించిన ఒకటి హిట్స్ ఇచ్చిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. గజిని చిత్రంతో బాలీవుడ్‌లోనూ హిట్ కొట్టారు. తెలుగులోనూ చిరంజీవితో స్టాలిన్, మహేష్ బాబుతో స్పైడర్ చిత్రాలు చేశారు. ఇక తమిళంలో రజనీకాంత్ హీరోగా రూపొందించిన దర్బార్ భారీ అంచనాల మధ్య విడుదలైన అపజయం మూటగట్టుకుంది. ఆ చిత్రం ప్లాప్ కావడం ఏఆర్ మురుగదాస్‌పై గట్టిగానే ప్రభావం చూపింది.
ఎంతగా అంటే ఆ తర్వాత ఆయన మరో చిత్రం చేయలేక పోయారు. నటుడు విజయ్‌కి తుపాకీ, సర్కార్ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన ఏఆర్ మురుగదాస్ ఆయనతో మరో చిత్రం చేయాల్సి ఉండగా విజయ్ ఆసక్తి చూపించలేదు. ఇక ఏఆర్ మురుగదాస్ నిర్మాతగా చేసిన చిత్రాలు తీవ్ర నిరాశ పరిచాయి. దీంతో ఎలాగైనా సక్సెస్ కొట్టి పూర్వ వైభవాన్ని చాటుకోవాలనే పట్టుదలతో దర్శకత్వం వహించడానికి సిద్ధమవుతున్నారు.
శివకార్తీకేయన్ హీరోగా చిత్రం చేయడానికి ముమ్మరంగా సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే కోలీవుడ్‌లో ఏఆర్ మురుగదాస్‌కు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. వారితో ఇటీవల ఇన్‌స్ట్రాగామ్‌లో ఏఆర్ మురుగదాస్ ముచ్చటించారు. ఈ సందర్భంగా మీ కొత్త చిత్రం ఎప్పుడు అన్న అభిమాని ప్రశ్నకు ఒక్క నెల ఓపిక పట్టండి బాస్ అని బదులిచ్చారు. అంటే ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించనున్న చిత్రం ప్రారంభం కానుందని హింట్ ఇచ్చారని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment