యంగ్ హీరో విశ్వక్‌సేన్‌పై సీనియర్ హీరో అర్జున్ ఫైర్ అయ్యాడు. అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ ఓ సినిమా కమిట్ అయిన విషయం తెలిసిందే. అందులో అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. చివరి నిమిషంలో ఆ ప్రాజెక్ట్ నుంచి విశ్వక్ తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి విశ్వక్ సేన్‌పై ఫైర్ అయ్యాడు.
‘నేను చెప్పిన కథ విశ్వక్‌సేన్‌కి బాగా నచ్చిందని చెప్పాడు. రెమ్యునరేషన్ విషయంలోనూ అతను చెప్పిన విధంగానే అగ్రిమెంట్ జరిగింది.కానీ కొన్ని వెబ్‌సైట్స్‌లో మా సినిమా నుంచి విశ్వక్ సేన్ తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. అవి ఎందుకు వచ్చాయో తెలియదు. నా లైఫ్‌లో విశ్వక్ సేన్‌కి చేసినన్ని కాల్స్ ఎవరికి చేయలేదు. ప్రతిసారి షూటింగ్ వస్తానని చెప్పి డుమ్మా కొడతాడు. కేరళలో షూట్ మొదలు పెట్టినప్పుడు అతని మేనేజర్ వచ్చి టైమ్ కావాలి అన్నాడు. నేను కూడా ఆర్టిస్ట్‌నే కదా.. అర్థం చేసుకొని ఓకే చెప్పి ఆ షేడ్యూల్‌ని కాన్సిల్ చేసుకున్నాం. దాని వల్ల జగపతి బాబు లాంటి పెద్ద నటుల డేట్స్ కూడా వేస్ట్ అయ్యాయి. అయినా పర్లేదు అనుకున్నాను.
ఆ తర్వాత విశ్వక్‌కి నేను చాలా సార్లు కాల్ చేశాను.. అతను పట్టించుకోలేదు. ఇటీవల నా దగ్గర వచ్చి మళ్లీ కథ చెప్పమన్నాడు. చెప్పాను సూపర్ అని అన్నాడు. దీంతొ ఈ నెల 3న షూట్ పెట్టుకున్నాం. రాత్రి 2 గంటల వరకు నాతో టచ్‌లో ఉన్నాడు. ఈ రోజు షూట్ అనగా.. ఉదయం ‘నేను రావడం లేదు.. నాకు టైమ్ కావాలి’అని మెసేజ్ చేశాడు. కథ నచ్చింది ప్రొడక్షన్ నచ్చింది అని చెప్పిన విశ్వాక్ సేన్ కి ఇంకా ఏమి నచ్చలేదు?
సీనియర్ హిరోలు ఎంతో కమిట్ మెంట్‌తో ఉంటారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు ఎంతో డెడికేటెడ్ గా ఉంటారు.. వాళ్లకు ఏమి తక్కువ? మన వర్క్ కి మనం సిన్సియర్ గా ఉండాలి అని చెపుతున్నాను. ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ ఎంతో పెద్ద స్థాయి లో ఉంది. సినిమా ఇండస్ట్రీలో టీమ్ వర్క్ ప్రధానం. ఇలాంటి వాతావరణంలో విశ్వక్‌తో నేను సినిమా చేయలేను. ఈ విషయం అందరికీ తెలియాలి అని ప్రెస్ మీట్ పెట్టాను. ఇక్కడ ఒక పద్దతి ఉంటుంది .. అందరూ ఆ పద్ధతిని పాటించాలి. కుదరదు అంటే ఇంట్లో కూర్చోవాలి.
అనూప్ మ్యూజిక్ , బుర్ర సాయిమాదవ్ డైలాగ్స్ , చంద్రబోస్ పాటల విషయంలో విశ్వక్ నాతో విభేదించారు. విశ్వక్ ప్రవర్తన వల్ల నేను ప్రస్తుతం సినిమా ఆపేశాను. వందకోట్లు వచ్చినా నేను విశ్వక్ తో సినిమా చేయను. త్వరలోనే కొత్త హీరో, టైటిల్ తో సినిమాను ప్రకటిస్తాను. విశ్వక్ ప్రవర్తనను ప్రొడ్యూసర్ గిల్డ్ దృష్టికి తీసుకెళ్తాను’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment