ఆశిష్ విద్యార్థి.. డిల్లీలో పుట్టి, పెరిగిన ఆయన 1991లో ‘కాల్ సంధ్య’ అనే హిందీ చిత్రంతో తెరంగేట్రం చేశారు. ‘పాపే నా ప్రాణం’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మహేశ్ బాబు నటించిన పోకిరి సినిమాతో టాలీవుడ్‌లో ఆయన పేరు మారుమ్రోగింది. దీంతో ఒక్కసారిగా ఆయనకు లెక్కలేనన్ని సినిమా అవకాశాలు వచ్చాయి. విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు.
అతిథి, తులసి, పోకిరి, లక్ష్యం, అలా మొదలైంది, నాన్నకు ప్రేమతో వంటి ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. కొద్దిరోజు క్రితం రైటర్ పద్మభూషణ్ సినిమాలో హీరో తండ్రిగా కనిపించి మెప్పించిన ఆయన రానా నాయుడు వంటి వెబ్‌సిరీస్‌లోనూ దుమ్మురేపాడు. కన్నడ, తమిళ్, మలయాళం, బెంగాలీ, ఒడియా, ఇంగ్లిష్ చిత్రాల్లోనూ నటించిన ఆయన కెరీర్ ప్రారంభంలోనే (1995) జాతీయ అవార్డు అందుకున్నాడు.
సినిమా ఇండస్ట్రీలో నాడు బిజీగా ఉన్న ఆయన నేడు అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. ఆయన కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను బతికే ఉన్నాను. నాకు కూడా అవకాశాలు ఇవ్వండి. నన్ను గుర్తించి ఆఫర్లు ఇవ్వండి అంటూ కామెంట్లు చేశాడు. అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఆయనకు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటి అంటూ కొందరు ఆశ్చర్యపోయారు కూడా..
తాజాగా ఆ వ్యాఖ్యలపై మరోసారి ఆశిష్ విద్యార్థి స్పందించారు. నేను చాలా భాషలలో నటించాను. అందులో ఎన్నో సినిమాల్లో మంచి పాత్రలు చేశాను. ఒక్కోసారి విలన్ పాత్రలు కూడా చేశాను. కానీ నన్ను ఇప్పటికీ అలానే చూస్తున్నారు. అలాంటి పాత్రలే ఆఫర్ చేస్తున్నారు. కానీ నేను వేరే పాత్రలు కూడా చేయగలను. ప్రేక్షకుల అభిరుచికి తగినట్లు సరికొత్త పాత్రలు చేయగలను. ఆ కోణంలో కూడా నన్ను చూడాలనే అభిప్రాయంతో ఆ వ్యాఖ్యలు చేశాను.' అని ఆయన అన్నారు. ఆశిష్ ఇటీవల రుపాలీ బరూవాను రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment