తెలంగాణ మహిళా కమిషన్‌కి జ్యోతిష్యుడు వేణుస్వామి క్షమాపణలు చెప్పారు. హీరో నాగచైతన్య-శోభితలపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నేరళ్ల శారదకు రాతపూర్వకంగా లేఖను అందజేశారు.
అసలేం జరిగిందంటే?
సినీ ప్రముఖుల జాతకాలు చెబుతూ ఫేమస్ అయిన వేణుస్వామి(Venu Swamy).. అక్కినేని హీరో నాగచైతన్య-శోభితల వివాహంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ..వారిద్దరు ఎక్కువ కాలం కలిసి ఉండరని జోస్యం చెప్పారు. త్వరలోనే ఇద్దరూ మళ్లీ విడాకులు తీసుకుంటారని వేణుస్వామి తేల్చి చెప్పారు. వారిద్దరు విడిపోతారంటూ జోస్యం చెప్పడంపై అక్కినేని అభిమానులతో పాటు మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున డిమాండ్స్ వచ్చాయి.
వేణు స్వామిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉమెన్ కమిషన్‌కి ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ ఉమెన్ కమిషన్ వేణు స్వామికి నోటీసులు పంపించి వివరణ కోరింది. మహిళా కమిషన్ నోటీసులను సవాలు చేస్తూ వేణు స్వామి హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు కూడా కమిషన్ ముందే హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో తెలంగాణ మహిళా కమిషన్ మరోసారి వేణు స్వామికి నోటీసులు జారీ చేసింది.
బహిరంగ క్షమాపణలు
మహిళా కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేయడంతో వేణుస్వామి తప్పనిసరి పరిస్థితుల్లో వేణుస్వామి మంగళవారం ఉమెన్ కమిషన్ కార్యాలయానికి హాజరై తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.అంతేకాదు బహిరంగ క్షమాపణలు చెబుతున్నాంటూ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నేరళ్ల శారదకు ఓ లేఖను అందజేశాడు. వేణు స్వామి క్షమాపణలు స్వీకరించిన మహిళా కమిషన్.. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కావొద్దని హెచ్చరించింది.
సమంత విషయంలోనూ..
సెలబ్రేటీల పర్సనల్ విషయాలపై జ్యోతిష్యాలు చెబుతూ వేణుస్వామి ఫేమస్ అయ్యాడు. గతంలో సమంత విషయంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. నాగచైతన్య, సమంత విడిపోతారని ముందే చెప్పాడు. సమంత, చైతు విడాకులు తీసుకున్న తర్వాత వేణు స్వామి మరింత ఫేమస్ అయ్యాడు. అయితే ఆ తర్వాత తరచూ సినీ ప్రముఖులపై జోతిష్యం చెప్పడంతో వేణుస్వామిపై విమర్శలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment