‘‘నటీనటుల నుంచి సహజమైన నటనను రాబట్టుకోవడం అనేది దర్శకుడిగా నాకున్న బలం. ఫ్రేమ్‌లో నటీనటులు ఎలా యాక్ట్ చేస్తున్నారనే విషయాన్నే నేను ముందు చూస్తాను. నన్ను, నా కథను, నా కొత్త ప్రయోగాన్ని మా నిర్మాతలు నమ్మారు. ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమా విజయం సాధిస్తుంది’’ అన్నారు రచయిత, దర్శక–నటుడు అవసరాల శ్రీనివాస్. నాగర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్‌గా నటించారు. టీజీ విశ్వప్రసాద్, దాసరి పద్మజ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకర్ల సమావేశంలో చిత్రదర్శకుడు అవసరాల శ్రీనివాస్ పంచుకున్న విశేషాలు.
► ఈ సినిమాలో ఏడు అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయం నిడివి దాదాపు 20 నిమిషాలు ఉంటుంది. కథ రీత్యా 18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల వయసు వరకు నాశౌర్య, మాళవిక పాత్రల ప్రయాణం ఉంటుంది. ఏడు చాప్టర్లూ ఈ పదేళ్ల వ్యవధిలోనే జరుగుతాయి.
► వయసుకి తగ్గట్లుగా పాత్ర తాలూకు ప్రవర్తన, ఆహార్యంలో వ్యత్యాసం చూపించడానికి నాగశౌర్య ఎంతో కష్టపడ్డారు. నిజజీవితంలో నేను చూసిన కొన్ని ఘటనల ఆధారంగా ఈ సినిమా కథ రాసుకున్నాను. పాత్రలు, సంభాషణలు చాలా సహజంగా ఉంటాయి. మనకు తెలిసిన కథలా, మనలో ఎవరో ఒకరి కథలా ఈ సినిమా ఉంటుంది.
► నాకు ఇష్టమైన యాక్టర్స్‌లో నాగశౌర్య ఒకరు. ఈ సినిమా యూకే షెడ్యూల్ కోసం 40 మందికి వీసాలు అప్లయ్ చేస్తే పదిమందికే ఓకే అయ్యాయి. దీంతో షూటింగ్ కోసం కొన్ని ఇబ్బందులు పడ్డాం. కానీ సెట్స్‌లో తన యాక్టింగ్‌తో నాగశౌర్య ఆ ఇబ్బందులను మర్చిపోయేలా చేసేవారు. ఈ సిని మాలో నాగశౌర్య పెర్ఫార్మెన్స్ ఎంత బాగుందనేది థియేటర్స్‌లో చూస్తారు. అలాగే ఈ సినిమాలో ముద్దు సీన్ ఉన్నట్లు మాళవికకు ముందే చెప్పాను. ఓ సన్నివేశానికి సరైన కారణాలు ఉంటే, కథకి ఖచ్చితంగా అవసరం అనిపిస్తే నటీనటులు ఆ సీన్‌లో యాక్ట్ చేయడానికి ఓకే అంటారన్నది నా అభిప్రాయం. ‘అష్టా చమ్మా’ చిత్రం నుంచే నాకు సంగీత దర్శకుడు కళ్యాణీ మాలిక్ తెలుసు. ఈ సినిమాకు ఆయన మంచి మ్యూజిక్ ఇచ్చారు. ‘కనుల చాటు..’ పాటను కీరవాణిగారు మెచ్చుకోవడంతో కళ్యాణీగారు ఇంకా సంతోషంగా ఉన్నారు.
► హిందీ ‘బ్రహ్మాస్త్రం’ టీమ్ ఓ సారి నాకు ఫోన్ చేసి తెలుగు డైలాగ్స్ రాస్తారా? అని అడిగారు. అప్పటికే ఆ సినిమా గురించి నాకు అవగాహన ఉండటంతో సరే అన్నాను. అలా ‘అవతార్ 2’కూ అవకాశం వచ్చింది. అయితే ఇంగ్లిష్ సినిమాలకు తెలుగు డైలాగ్స్ రాయడం చాలా కష్టం. కానీ చాలెంజ్‌గా తీసుకుని రాశాను. ఇక నటుడిగా ‘కన్యాశుల్కం’ వెబ్ సిరీస్ చేశాను. దర్శకుడిగా నా తర్వాతి చిత్రం గురించి త్వరలో అధికారికంగా చెబుతాను.
ముద్దు సీన్ గురించి మాళవికకు ముందే చెప్పాను: అవసరాల శ్రీనివాస్
Published Sun, Mar 5 2023 8:41 AM | Last Updated on Sun, Mar 5 2023 8:41 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment