
కంటెంట్‌లో దమ్ము ఉంటే ఎంత చిన్న సినిమా అయినా, ఎటువంటి ప్రచారం లేకపోయినా కేవలం మౌత్ టాక్‌తో ఆడియన్స్‌ను థియేటర్‌కు రప్పిస్తుంది. బలగం సినిమాకు చిత్రయూనిట్ ఎంత ప్రచారం చేసిందో కానీ జనాలు అంతకుమించి పబ్లిసిటీ చేశారు. ఒకసారి సినిమా చూసి వదిలేయకుండా ఇష్టంగా, బాధ్యతగా కుటుంబాన్ని సైతం థియేటర్‌కు తీసుకెళ్లారు. ప్రేక్షకులే దాన్ని సూపర్ హిట్ చేశారు.
బలగం సినిమా షూటింగ్ అంతా సిరిసిల్ల పరిసర ప్రాంతాల్లోనే జరిగింది. సినిమా సక్సెస్ కావడంతో చిత్రీకరణ జరిపిన లొకేషన్స్ కూడా పాపులరయ్యాయి. ఆ లొకేషన్స్‌లో హీరో ఇల్లు కూడా ఉంది. కోనరావుపేట మండలం కోలనూరు గ్రామంలో ఉందీ ఇల్లు. తాజాగా ఈ ఇంటి యజమాని రవీంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'బలగం సినిమా డైరెక్టర్ వేణుది మా ఊరే. దిల్ రాజుగారు సినిమా ఛాన్స్ ఇచ్చారు.. సాయం చేయమని అడిగితే నా ఇల్లు ఇచ్చాను. నెలన్నర రోజులు ఈ ఇంట్లో షూటింగ్ చేస్తే మేము వేరే ఇంట్లో ఉన్నాం. డబ్బులిస్తామన్నారు. కానీ నేనే వేణు దగ్గర ఒక్క రూపాయి తీసుకోలేదు. ఈ సినిమా ఊహించనంత పెద్ద హిట్టయింది.. సినిమాలో మా ఇల్లు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది.
సినిమా షూటింగ్ అన్ని వారాలు జరిగింది. కానీ ఏనాడూ దిల్ రాజు గారు ఇక్కడికి రాలేదు. ఆయన కూతురు, తమ్ముడి కొడుకు మాత్రమే వచ్చారు. సినిమా సక్సెస్ అయ్యాక వేణు కనీసం థ్యాంక్స్ చెప్పలేదు. నా నెంబర్ ఆయన దగ్గర ఉంది కానీ ఫోన్ చేయలేదు, మేము గుర్తు రాలేదు. అయినా ఆయన నుంచి ఇవేమీ నేను ఆశించలేదు కూడా! సినిమా కోసం ఇష్టపడి ఇల్లు ఇచ్చాను. దీని నుంచి ఎలాంటి పబ్లిసిటీ కోరుకోవడం లేదు' అని చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment