టైటిల్: బనారస్
నటీనటులు: జైద్ ఖాన్, సోనాల్ మోంటెరో, సుజయ్ శాస్త్రి, దేవరాజ్, అచ్యుత్ కుమార్, సప్నా రాజ్, బర్కత్ అలీ తదితరులు
నిర్మాత: తిలకరాజ్ బల్లార్
దర్శకత్వం: జయతీర్థ
సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్
సినిమాటోగ్రఫీ: అద్వైత గురుమూర్తి
ఎడిటర్: కేఎం. ప్రకాశ్
విడుదల తేది: నవంబర్ 4, 2022
కథేంటంటే..
సిద్ధార్థ్(జైద్ ఖాన్) ఓ ధనవంతుడి కుటుంబానికి చెందని యువకుడు. చిన్నప్పుడే తల్లిని కోల్పోవడంతో తండ్రి గారాబంగా పెంచుతాడు. స్నేహితులతో పార్టీలు.. ట్రిప్స్ అంటూ లైఫ్‌ని ఎంజాయ్ చేసే సిద్ధార్థ్.. ఓ పందెంలో నెగ్గడం కోసం ధని(సోనాల్ మోంటెరో)కి దగ్గరవుతాడు. తాను టైమ్ ట్రావెల్‌లో భాగంగా ఫ్యూచర్ నుంచి ప్రజెంట్‌కు వచ్చానని.. భవిష్యత్తులో మనిద్దరం పెళ్లి చేసుకొని ఓ పాపకు జన్మనిస్తామని చెబుతాడు. సిద్ధార్థ్ చెప్పిన మాయ మాటలు నమ్మిన ధని.. అతన్ని తన రూమ్‌కి తీసుకెళ్తుంది. ఆమె నిద్రిస్తున్న సమయంలో సిద్ధార్ ఆమెతో సన్నిహితంగా ఉన్నట్లు ఫోటో దిగి వెళ్లిపోతాడు. మూడు రోజుల్లో ఆమెను ప్రేమలో పడేయడమే కాకుండా.. ఆమె రూమ్‌కి కూడా వెళ్లానంటూ స్నేహితుల దగ్గర పందెం నెగ్గుతాడు. అయితే స్నేహితులు చేసిన పని వల్ల ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో సింగింగ్ రియాల్టీ షోలో పాల్గొంటున్న ధని క్యారెక్టర్‌పై కామెంట్స్ వస్తాయి. ఆమె బాగా ట్రోల్ కావడంతో హైదరాబాద్ వదిలి బనారస్(వారణాసి)కి వెళ్తుంది. తాను చేసిన తప్పును గ్రహించిన సిద్ధార్థ్ ఆమెకు క్షమాపణలు చెప్పడం కోసం బెనారాస్ వెళ్తుంది. ఆమె కోసం వెతుకున్న సమయంలో సిద్ధార్థ్ టైమ్ ట్రావెల్‌లో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సిద్ధార్థ్ టైమ్ ట్రావెల్‌లో ఎలా ఇరుక్కున్నాడు? చివరకు ధని, సిద్ధార్థ్ ఎలా ఒకటయ్యారు? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
టైమ్ ట్రావెల్ నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈ చిత్రం అదే జానర్‌లో తెరకెక్కినా కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. లవ్‌స్టోరీ, ఫిలాసఫీ, ట్వీస్ట్‌లతో సినిమా సాగుతుంది. సినిమా స్టార్టింగ్‌లోనే టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ని పరిచయం చేశాడు దర్శకుడు. అయితే కాసేపటికే కథ మారిపోతుంది. సాధారణ ప్రేమ కథగా సాగుతుంది. స్నేహితులు చేపిన తప్పుకు హీరో క్షమాపణలు చెప్పడం... ఈ క్రమంలో ఆమెతో ప్రేమలో పడడం..ఇలా రొటీన్‌గా ఫస్టాఫ్ సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది. సెకండాఫ్‌లో కథ మలుపు తిరుగుతుంది. సిద్ధార్థ్ టైమ్ లూప్‌లో పడిపోవడంతో కథ ఆసక్తికరంగా సాగుతుంది. వరుస ట్విస్ట్‌లు ప్రేక్షకుడిని గందరగోళానికి గురిచేస్తాయి. కథ ఇక అయిపోయింది అనే సమయానికి మరో ట్విస్ట్..ఇలా సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ఫ్రైజ్ ఇస్తూ సెకండాఫ్‌ని తీర్చిదిద్దాడు దర్శకుడు. సెకండాఫ్ తర్వాత ఫస్టాఫ్ ఎవరికీ గుర్తుండదు. ఒకే టికెట్‌పై రెండు సినిమాలు చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే క్లైమాక్స్ మాత్రం రోటీన్‌గా ఉండడం నిరాశ పరుస్తుంది.
ఎవరెలా చేశారంటే..
జైద్‌ఖాన్‌కి ఇది తొలి చిత్రం అయినప్పటికీ చక్కగా నటించాడు. తెరపై హ్యాండ్సమ్‌గా కనిపించాడు. యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సీన్స్‌లో కూడా చక్కటి నటనను కనబరిచాడు. ధని పాత్రకి హీరోయిన్ సోనాల్ మోంటెరో న్యాయం చేసింది. తెరపై అచ్చం తెలుగమ్మాయిలా కనిపిస్తుంది. కథంతా హీరోహీరోయిన్ల చుట్టే తిరగడంతో ఈ సినిమాలో మిగతా పాత్రలు అంతగా గుర్తుండవు. అయితే డెత్ ఫోటోగ్రాఫర్ చెంబూ పాత్ర మాత్రం కాస్త నవ్వులు పూయిస్తుంది. హీరో తండ్రిగా దేవరాజ్, హీరోయిన్ బాబాయ్‌గా అచ్యుత్ కుమార్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే... అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. బెనరాస్ అందాలను తెరపై చక్కగా చూపించాడు. : బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం బాగుంది. మాయ గంగా సాంగ్ ఆకట్టుకుంటుంది. కేఎం. ప్రకాశ్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి.
-అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment