టైటిల్ : బంగార్రాజు
నటీనటులు : నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి, నాగబాబు రావు రమేశ్, వెన్నెల కిశోర్, సంపత్ రాజ్, గోవింద్ పద్మసూర్య తదితరులు
నిర్మాణ సంస్థలు : అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్
నిర్మాత : అక్కినేని నాగార్జున
దర్శకత్వం : కల్యాణ్ కృష్ణ కురసాల
సంగీతం : అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ : జె. యువరాజ్
ఎడిటర్ : విజయ్ వర్థన్
విడుదల తేది : జనవరి 14, 2022
Bangarraju Movie Review: అక్కినేని నాగార్జున డ్యూయల్ రోల్ లో చేసిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’చిత్రం 2016 సంక్రాంతి సీజన్‌లో విడుదలై సూపర్ హిట్టైంది. ఏకంగా కింగ్ కెరీర్ లోనే బిగ్ హిట్ గా నిలిచింది. ఆ మూవీ భారీ విజయం సాధించడంతో అందులోని బంగార్రాజు పాత్రతో కథని అల్లుకొని ‘సోగ్గాడే చిన్ని నాయనా’కి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ సినిమా తెరకెక్కింది. ‘మనం’ తర్వాత నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన ఈ చిత్రం శుక్రవారం(జనవరి 14)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కి మంచి స్పందన రావడం.. దానికి తోడు ప్రమోషన్స్‌ని గ్రాండ్ చేయడంలో ‘బంగార్రాజు’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఈ సంక్రాంతి బరిలోకి దిగిన ఏకైన పెద్ద సినిమా ‘బంగార్రాజు’ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించాడు? రివ్యూలో చూద్దాం.
‘బంగార్రాజు’కథేంటంటే
‘సోగ్గాడే చిన్ని నాయన’చిత్రం ఎక్కడ ముగిసిందో.. అక్కడి నుంచి ‘బంగార్రాజు’కథ స్టార్ట్ అవుతుంది. ఆత్మగా వచ్చిన బంగార్రాజు(నాగార్జున)..తన ఫ్యామిలీ సమస్యలన్నీ చక్కదిద్ది స్వర్గానికి తిరిగి వెళ్తాడు. కొన్నాళ్లకు డాక్టర్ రాము(నాగార్జున), సీత దంపతులకు కొడుకు పుట్టడం..భార్య చిన్నప్పుడే చనిపోవడంతో..అతని బాధ్యలను నాన్నమ్మ సత్య అలియాస్ సత్తెమ్మ(రమ్యకృష్ణ) చూసుకుంటుంది. మనవడు పెద్దయ్యేసరికి.. సత్తెమ్మ కూడా చనిపోయి..స్వర్గంలో ఉన్న బంగార్రాజు దగ్గరకు వెళ్లుంది. చిన్నబంగార్రాజు(నాగచైతన్య) కూడా తాత మాదిరే ఊర్లో ఆవారాగా తిరుతూ.. అమ్మాయిల వెంటపడుతుంటాడు. మరోపక్క చిన్న బంగార్రాజు మరదలు.. నాగలక్ష్మీ(కృతిశెట్టి) ఆ ఊరికి సర్పంచ్ అవుతుంది. వీరిద్దరికి ఒకరంటే ఒకరుపడరు. కానీ వీరిద్దరికి పెళ్లి చేస్తే బాగుంటందని భావిస్తుంది సత్తెమ్మ. తన మనవడి ప్రేమకి సహాయం చేయడానికి బంగార్రాజుని భూమ్మీదకి పంపిస్తుంది. చిన్న బంగార్రాజు శరీరంలోకి పెద్ద బంగార్రాజు చేరి.. సర్పంచ్ నాగలక్ష్మీని ప్రేమించేలా చేస్తాడు. మరోవైపు చిన్న బంగార్రాజు హత్య చేయడానికి కొంతమంది ప్లాన్ చేస్తారు. అసలు చిన్న బంగార్రాజుని ఎందుకు హత్య చేయాలనుకున్నారు? హత్యకు కుట్ర చేసిందెవరు? ఆపదలో ఉన్న మనవడిని బంగార్రాజు ఎలా కాపాడుకున్నాడు? ఊరి గుడి కింద ఉన్న నిధులపై కన్నేసిన దుష్టశక్తుల పన్నాగాలను బంగార్రాజు ఎలా తిప్పికొట్టారు? అనేదే మిగతా కథ.
ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాకు ప్రధాన బలం నాగార్జున, నాగచైతన్యల నటననే. చిన్నబంగార్రాజు, పెద్ద బంగార్రాజు పాత్రల్లో వీరిద్దరు ఒదిగిపోయారు. సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తాయి. బంగార్రాజు ఆత్మ దూరిన ప్రతిసారి నాగచైనత్య చేసే సందడి ఆకట్టుకుంటుంది. అయితే సాధారణ సమయంలో చిన్నబంగార్రాజు కామ్‌గా ఉండడం.. ఆత్మ దూరిన తర్వాత రెచ్చిపోవడంతో.. చై కంటే నాగార్జుననే హైలెట్ అయ్యాడని చెప్పాలి. క్లైమాక్స్‌లో వీరిద్దకు కలిసే చేసే ఫైట్ సీన్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక సర్పంచ్ నాగలక్ష్మీగా కృతిశెట్టి తనదైన నటనతో మెప్పించింది. అమాయకపు మాటలతో నవ్వించింది. బంగార్రాజు భార‍్య సత్య అలియాస్ సత్తెమ్మగా రమ్యకృష్ణ మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించింది. సంపత్ రాజ్, రావు రమేశ్, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఎలా ఉందంటే..
2016లో సంకాంత్రికి విడుదలైన‘సోగ్గాడే చిన్ని నాయనా’ఎంతటి ఘటన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్ అనగానే ‘బంగర్రాజు’కథ ఎలా ఉండబోతుందో అంతా ఊహించుకున్నారు. అనుకున్నట్లుగానే.. పల్లెటూరి వాతావరణం, కలర్‌ఫుల్ సాంగ్స్‌తో ఫన్ అండ్ ఎమోషనల్‌గా ‘బంగార్రాజు’కథ సాగుతుంది. సోగ్గాడే.. సినిమా మాదిరినే.. ఈ చిత్రానికి కూడా గుడికి, బంగార్రాజు కుటుంబానికి ముడిపెట్టి కథను అల్లుకున్నాడు దర్శకుడు కల్యాణ్ కృష్ణ. అందులో కొడుకు,కోడళ్లను కలిపేందుకు బంగ్రారాజు ఆత్మ భూమ్మీదకు వస్తే.. ఇందులో మనవడిని జీవితాన్ని చక్కబెట్టేందుకు కిందకు వస్తాడు. ఇక ఈ సీక్వెల్‌లో సత్తెమ్మ ఆత్మ అదనం. అయితే సోగ్గాడే.. ఆకట్టుకున్నంతగా.. బంగార్రాజు ఆకట్టుకోలేకపోయాడు.
ఫస్టాఫ్ అంతా రోటీన్ సీన్లతో నెమ్మదిగా సాగుతుంది. బంగార్రాజు, సత్యల ఆత్మలు భూమ్మీదకు వచ్చాక కథలో వేగం పెరుగుతుంది. అయినప్పటికీ.. సాదాసీదాగానే సాగిపోతుంది. సర్పంచ్ నాగలక్ష్మీ, చిన్నబంగార్రాజుల మధ్య జరిగే టామ్ అండ్ జెర్రీ వార్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. పెద్ద బంగార్రాజు చేసే సందడి మాత్రం ప్రేక్షకులను నవ్విస్తుంది. ఇక సెకండాఫ్‌లో కూడా కథ ప్రేక్షకుడి ఊహకి అందేలా సాగుతుంది. కామెడీ కూడా అంతగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. ‘వీరి వీరి గుమ్మడి పండు’గేమ్ సీన్ అలరిస్తుంది. ఇక సినిమాను ప్రధాన బలం ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ అనే చెప్పాలి. చివరి 30 నిమిషాలు సినిమాపై అభిప్రాయాన్ని మారుస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక సాంకెతిక నిపుణుల పనితీరు విషయానికొస్తే.. అనూప్ రూబెన్స్ సంగీతం సినిమాకి ప్లస్. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా చక్కగా అందించాడు. అయితే సినిమాల్లో వచ్చే పాటలు.. కథకు అడ్డంకిగా అనిపిస్తాయి. యువరాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. విజయ్ వర్థన్ తన కత్తెర ఇంకాస్త పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment