‘‘నేనెప్పుడూ ఏదీ ప్లాన్ చేసుకుని చేయలేదు. నా దారిలో వచ్చే బెస్ట్‌ని ఎంపిక చేసుకుంటూ ముందు కెళ్తాను. నా బాలీవుడ్ ఎంట్రీ కూడా ప్లాన్ చేయలేదు. మంచి ఆఫర్ వచ్చింది. అందుకున్నాను’’ అన్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇవాళ తన పుట్టినరోజు. సాయి శ్రీనివాస్ నటించిన ‘అల్లుడు అదుర్స్’ ఈ నెల 15న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆయన పలు విశేషాలు పంచుకున్నారు.
► కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలు తీసు కోవడంలాంటివేమీ పెట్టుకోను. గడచిన ఏడాది కంటే ఈ సంవత్సరం ఇంకా సంతోషంగా ఉండాలి. గుర్తుండిపోయేలా చేసుకోవాలని మాత్రమే అనుకుంటాను. గత బర్త్‌డేకి సెట్లోనే ఉన్నాను. ఈ బర్త్‌డేకి కూడా పని చేస్తున్నాను. నాకు సినిమా అంటే ఇష్టం. పుట్టినరోజున నచ్చిన పని చేయడాన్ని మించిన కిక్ ఏముంటుంది?
► 2020లో షూటింగ్‌ని చాలా మిస్సయ్యాను. ఈ బ్రేక్‌ని సినిమాలు చూడటానికి ఎక్కువ ఉపయోగించుకున్నాను. నా వర్క్‌ని మళ్లీ సమీక్షించుకున్నాను. ఫ్రెండ్స్‌తో చాలా సమయం గడిపే వీలు దొరికింది. వేసవి సెలవుల్లా అనిపించాయి.
► కథలో భాగంగా ‘అల్లుడు అదుర్స్’ అని టైటిల్ పెట్టాం. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ నన్ను ఓ కొత్త కోణంలో చూపించాలనుకున్నారు. నాకు కథ నచ్చింది. చేసేశాను. ఇందులో సోనూ సూద్, ప్రకాశ్‌రాజ్ లాంటి భారీ తారాగణం ఉన్నారు. సినిమా కచ్చితంగా అందర్నీ చాలా ఎంటర్‌టైన్ చేస్తుంది.
► ‘అల్లుడు అదుర్స్’ నా తొలి సంక్రాంతి రిలీజ్. జనవరి నెల నాకు స్పెషల్. చాలా ఇష్టం. కొత్త ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు ఈ సినిమా కూడా విడుదలవుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇంకా ఆరు రోజులు ఉంది. 10 రోజులుగా పగలు, రాత్రి పని చేస్తున్నాం. నిర్మాత (బెల్లంకొండ సురేశ్) అబ్బాయిని నేను. నిర్మాతకు నష్టం రాకూడదనుకుంటాను. అందుకే ఈ సినిమాను త్వరగా పూర్తి చేయడానికి కష్టపడుతున్నాం.
► బాలీవుడ్ ఆఫర్ (హిందీలో ‘ఛత్రపతి’ రీమేక్‌ను వినాయక్ డైరెక్షన్‌లో చేస్తున్నారు శ్రీనివాస్) ఊహించలేదు. కానీ వచ్చింది. వచ్చిన మంచి అవకాశాన్ని అస్సలు పోగొట్టుకోను. మన పని పది మంది కాదు వెయ్యి మంది చూస్తారంటే ఏ యాక్టర్‌కి అయినా ఇష్టమేగా! రాజమౌళిగారి సినిమా రీమేక్ చేస్తే ఆయనతో సినిమా చేసినట్టే. మంచి ప్రొడక్షన్. భారీ స్థాయిలో చేయాలనుకుంటున్నారు. వినాయక్‌గారితో మళ్లీ వర్క్ చేయడం ఎగ్జయిటింగ్‌గా ఉంది. ‘అల్లుడు అదుర్స్’ ట్రైలర్ చూసి నటుడిగా చాలా ఎదిగావని వినాయక్‌గారు మెచ్చుకున్నారు.
► ‘ఛత్రపతి’ రీమేక్ కోసం హిందీ డిక్షన్ మీద ఇంకా బాగా వర్క్ చేస్తాను. శారీరకంగా కూడా వర్కౌట్ చేస్తాను. తెలుగు సినిమా ప్రస్తుతం బెస్ట్ ఇండస్ట్రీ. ఎందులోనూ తక్కువ కాదు. ఏ కథ వస్తే ఆ సినిమా చేస్తాను. తొలి సినిమాలా కష్టపడతాను. బాలీవుడ్ ఆఫర్ వచ్చినప్పుడు నాన్న ముఖంలో చాలా సంతోషం చూశాను. ఆ ఆనందం ఎప్పటికీ చూడాలని ఇంకా ఇంకా కష్టపడాలనుంటుంది.
► ఓటీటీ వర్సెస్ థియేటర్స్ గురించి చెప్పాలంటే హోమ్ థియేటర్ ఇంటి భోజనంలాంటిది. థియేటర్ బిర్యాని. దేని టేస్ట్ దానిదే. కానీ థియేటర్స్ ఇచ్చే అనుభూతి ఏదీ ఇవ్వలేదు. హాలీవుడ్‌లోనూ చాలా సినిమాలు ఓటీటీలో విడుదలవుతాయి. పెద్ద పెద్ద యాక్షన్ సినిమాలే థియేటర్స్‌లో విడుదలవుతాయి. అది నమ్మే యాక్షన్ సినిమాలు చేస్తూ ఉంటాను (నవ్వుతూ).
అంతకు మించిన కిక్ ఏముంటుంది?
Published Sun, Jan 3 2021 1:10 AM | Last Updated on Sun, Jan 3 2021 4:43 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment