
సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(Ram Gopal Varma)కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(AP High Court)లో భారీ ఊరట లభించింది. ఆయన దర్శకత్వం వహించిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై నమోదైన కేసు విచారణపై హైకోర్టు స్టే విధించింది. సీఐడీ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఆర్జీవీ బుధవారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశాడు.
నేడు విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఐదేళ్ల క్రితం(2019)లో రిలీజైన సినిమాపై ఇప్పుడు కేసు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించి, తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.
ఏం జరిగింది?
2019లో 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'(kamma rajyam lo kadapa reddlu) పేరుతో ఆర్జీవీ ఒక సినిమాను రూపొందించారు. 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' పేరుతో సినిమాను రిలీజ్ చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాను చిత్రీకరించారని వర్మపై మంగళగిరి సమీపంలోని ఆత్మకూరుకు చెందిన బండారు వంశీకృష్ణ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను కూడా తొలగించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆర్జీవీకి సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. సీఐడీ నోటీసులను సవాల్ చేస్తూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment